
Dilraju: ‘రౌడీబాయ్స్’తో యువతరం కనెక్ట్ అవుతోంది
ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రం ‘రౌడీబాయ్స్’. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కథ, కథనాలు బాగున్నాయని.. ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో పండగ తర్వాతా వసూళ్లు తగ్గలేదు. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా నడుస్తోంది. ఇప్పటి వరకు ఏడు కోట్ల గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. కొత్త హీరో చిత్రానికి ఈస్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి ఆశిష్ హీరోగా ‘సెల్ఫిష్’ అనే చిత్రం నిర్మిస్తున్నాం. సుక్కు శిష్యుడు కాశీ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు’’ అన్నారు.