Naresh: అప్పుడు కోల్పోయింది..ఇప్పుడు ఆస్వాదిస్తున్నా

‘‘50ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఇప్పటికీ కొత్త పాత్రలు వేస్తున్నాను. ఇదంతా నా కోసం పాత్రలు సృష్టిస్తున్న రచయితలు, నన్ను ప్రోత్సహిస్తున్న దర్శకులు, ఆదరిస్తున్న ప్రేక్షకుల వల్లే సాధ్యమవుతోంది’’ అన్నారు సీనియర్‌ నటుడు నరేష్‌. ప్రస్తుతం తెలుగు

Updated : 20 Jan 2022 07:09 IST

‘‘50ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఇప్పటికీ కొత్త పాత్రలు వేస్తున్నాను. ఇదంతా నా కోసం పాత్రలు సృష్టిస్తున్న రచయితలు, నన్ను ప్రోత్సహిస్తున్న దర్శకులు, ఆదరిస్తున్న ప్రేక్షకుల వల్లే సాధ్యమవుతోంది’’ అన్నారు సీనియర్‌ నటుడు నరేష్‌. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ కొత్త బాటలో వెళ్తోందని.. ఇలాంటి సమయంలో నటుడిగా తానూ మంచి చిత్రాల్లో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గురువారం నరేష్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘నటుడిగా నా సినీ ప్రయాణం మొదలై 50ఏళ్లు పూర్తవుతోంది. నిజానికి ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చాలా అరుదుగా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన నా గురువు జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లను ఎప్పుడూ మర్చిపోను. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలు వచ్చినప్పుడు.. నటుడు ఎస్వీ రంగారావునే  స్ఫూర్తిగా తీసుకున్నా. యువ దర్శకులు కొత్త కాన్సెప్ట్‌లు, గెటప్‌లతో రావడం చాలా ఆనందంగా ఉంది’’.

‘‘అందరినీ కలుపుకొనిపోవడం, కలిసి పనిచేయడం, దర్శకులు చెప్పింది చేయడం.. వంటి వాటి వల్లే నటుడిగా నేనిప్పటికీ   టాప్‌లోనే ఉన్నాను. రెమ్యునిరేషన్‌ గురించి ఎప్పుడూ ఆలోచించను. రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్లు నటుడిగా నన్ను నేను చాలా మిస్‌ అయ్యాను. ఆ సమయంలో ఒత్తిడికి లోనయ్యా. అప్పుడు నటుడిగా నేనేదైతే కోల్పోయానో..   ఇప్పుడది ఆస్వాదిస్తున్నాను. చాలా మంది నన్ను లక్కీ ఆర్టిస్ట్‌ అంటుంటారు. మంచి చిత్రాల్లో నన్ను తీసుకున్నందుకు నిజంగా లక్కీనే’’.

‘‘ఈ ఏడాది నా నుంచి మంచి చిత్రాలు రానున్నాయి. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి’, సంతోష్‌ శోభన్‌     ‘అన్నీ మంచు శకునములే’, వరుణ్‌ తేజ్‌ ‘గని’ తదితర చిత్రాల్లో చేస్తున్నాను. అలాగే రామ్‌ చరణ్‌ - శంకర్‌ చిత్రంలోనూ, నవీన్‌ పొలిశెట్టి కొత్త సినిమాలోనూ నటిస్తున్నాను’’.

‘‘మా విజయ కృష్ణ మూవీస్‌ ప్రారంభించి 50ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు దాన్ని విజయ కృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌గా మార్చాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సినిమాలను నిర్మించాలనేది మా సంకల్పం. వినోదాత్మకంగా ఉండే మంచి చిత్రాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మళ్లీ విజయ    కృష్ణ మూవీస్‌ పతాకాన్ని ఎగరవేయాలనుకుంటున్నాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని