Govind Padmasoorya:దేనికైనా సిద్ధం

తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం  అంటున్నారు నటుడు గోవింద్‌ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి  కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్‌ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు.

Updated : 22 Jan 2022 07:02 IST

తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం  అంటున్నారు నటుడు గోవింద్‌ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి  కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్‌ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బంగార్రాజు’లో ఆది అనే ప్రతినాయకుడి పాత్రలో మెరిశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. పండగకొచ్చిన ‘బంగార్రాజు’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో తృప్తినిచ్చిందని, ప్రస్తుతం తాను తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు. ‘‘మలయాళంలోనే నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగానే పరిచయమయ్యా. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్‌గోపి తదితర స్టార్స్‌తో కలిసి నటించా. తమిళంలో జీవా చేసిన ‘కీ’లో ప్రతినాయకుడిగా నటించా. ఆ సినిమా చూసే దర్శకుడు త్రివిక్రమ్‌ నాకు ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. నేను చూసిన తొలి తెలుగు చిత్రం ‘అతడు’. ఆ  సినిమాని తెరకెక్కించిన త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే నేను తెలుగుకి పరిచయం కావడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అది తమిళం, మలయాళంలో విడుదల కావడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ‘బంగార్రాజు’లో నాగార్జునతో కలిసి తెరను పంచుకోవడం నా    కెరీర్‌లో ఓ గొప్ప జ్ఞాపకం. ఆయనతో కలిసి నటించడం నాకొక గొప్ప పాఠం. ‘బంగార్రాజు’ కోసం చేసిన ప్రయాణంలో నాగచైతన్య, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ నాకు మంచి మిత్రులయ్యారు. కృతిశెట్టిని చూసి నేను తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టా’’ అన్నారు. హీరో, విలన్‌, కామెడీ... ఎలాంటి పాత్రకైనా తనలోని నటుడు సిద్ధమే అన్నారు గోవింద్‌ పద్మసూర్య. నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న  ‘మీట్‌ అండ్‌ క్యూట్‌’లోనూ, త్వరలోనే మొదలు కానున్న మేర్లపాక గాంధీ సినిమాలోనూ నటిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని