Tollywood: విజయంలో ముఖ్యమైన ‘పాత్ర’

పాత్రల పేర్లే సినిమాలకీ పేర్లవుతున్నాయి. విడుదల తర్వాత కథల కంటే ఆ పాత్రలే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి హావభావాలు, నడవడికని ప్రేక్షకులు అనుకరించేంతగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ చేసిన పుష్పరాజ్‌ పాత్ర జనంలోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Updated : 22 Jan 2022 08:37 IST

పాత్రల పేర్లే సినిమాలకీ పేర్లవుతున్నాయి. విడుదల తర్వాత కథల కంటే ఆ పాత్రలే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి హావభావాలు, నడవడికని ప్రేక్షకులు అనుకరించేంతగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ చేసిన పుష్పరాజ్‌ పాత్ర జనంలోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టా రీల్స్‌, మీమ్స్‌ నుంచి యూట్యూబ్‌ పేరడీల వరకూ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాత్ర మేనరిజాన్ని అనుసరించారు. మొత్తంగా ఇటీవల విడుదలైన సినిమాల్లో పాత్రలే విజయాల పంట పండిస్తున్నాయి. కొనసాగింపుగా మరో సినిమాతీయడానికి కావల్సినంత భరోసాని అవే ఇస్తున్నాయి. 

సహజంగా ఓ సినిమా విడుదల తర్వాత కథ కొత్తదనో లేదంటే పాతదనో... బాగుందనో బాగోలేదనో - ఇలా సినీ   ప్రేమికుల చర్చంతా కథ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు  కథ కంటే అందులోని పాత్రలే ఎక్కువగా చర్చని లేవనెత్తుతుంటాయి. ఇటీవల విడుదలైన తెలుగు  సినిమాల విషయంలో అదే జరిగింది. కథా నాయకుల క్యారెక్టరైజేషనే ఆయా సినిమాలకి కీలకంగా మారింది. అవే ఫలితాల్నీ  ప్రభావితం చేశాయి. కథ లేకుండా సినిమా లేదనేది అందరికీ తెలిసిన సత్యమే. కొన్నిసార్లు ఓ బలమైన పాత్ర నుంచే కథ   పుడుతుంటుంది. ఆ పాత్రే కథని సైతం శాసిస్తుంటుంది. అలాంటప్పుడే ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్‌సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ తరహా సినిమాలొస్తుంటాయి.

* ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేసుండొచ్చు. బోయపాటి శ్రీను బలమైన అంశాల్ని చాలానే స్పృశించి ఉండొచ్చు కానీ... అందులో అన్నిటికంటే హైలెట్‌గా నిలిచింది అఘోరా పాత్రే. కథపై అఖండమైన ప్రభావం చూపించిందా పాత్ర. దానికి ఆపాదించిన ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలు సూపర్‌ హీరోని చేశాయి. దాంతో ఎలాంటి విన్యాసాలు చేసినా ప్రేక్షకులు నమ్మారు. అందుకే ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధించింది. అఖండ పాత్ర కొనసాగే అవకాశాలూ ఉన్నాయి.


* ‘పుష్ప’ సినిమాలో కథతో పాటు.. పుష్పరాజ్‌గా కథా  నాయకుడిగా పాత్ర, దాని చిత్రణ, అందులో అల్లు అర్జున్‌ నటించిన తీరు హైలెట్‌గా నిలిచాయి. ‘పుష్ప: ది రైజ్‌’ అనే పేరుకు తగ్గట్టుగానే సినిమా అంతా ఆ పాత్ర, అది ఎదిగే క్రమంతోనే కథనం నడిచింది. దర్శకుడు సుకుమార్‌ సినిమాల్లో కథానాయకుడి పాత్రలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సినిమాలో అది మరింత ఎక్కువై ప్రేక్షకులను కట్టిపడేసింది. అల్లు అర్జున్‌ తన కోసమే పుట్టిన పాత్ర అన్నట్టుగా అందులో ఒదిగిపోయారు. రెండోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న పుష్పరాజ్‌ ఇంకా ఎన్ని కథలుగా కొనసాగుతాడో చూడాలి.


* ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పాత్రని ఉద్దేశిస్తూ పెట్టిన పేరే. నాని రెండు పాత్రల్లో కనిపించినా శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవదాసీ వ్యవస్థని ప్రస్తావించినా శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రకి ఉన్న ప్రత్యేకమైన లక్షణం, ఆ పాత్ర హావభావాలు, బెంగాలీ గెటప్‌ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. క్యారెక్టరైజేషన్‌తోనే ఎక్కువగా ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు.


* సంక్రాంతికి వచ్చి విజయాన్ని అందుకున్న ‘బంగార్రాజు’ సినిమా రావడానికి కారణమే బంగార్రాజు పాత్ర. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన సందడి ప్రేక్షకులకు భలే నచ్చింది. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు, హావభావాలు ఆకట్టుకున్నాయి. అందుకే ఆ పాత్రని కొనసాగిస్తూ కథని రాసుకుని సినిమాని తీశారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ  కురసాల. బంగార్రాజు పాత్రని కొనసాగించే ఆలోచనా ఉందని చెబుతున్నారు నాగార్జున.


పాత్రల పేర్లతో సినిమాలు రావడం... క్యారెక్టరైజేషన్‌లతో ప్రేక్షకులపై ప్రభావం చూపించడం తెలుగు సినిమాకి కొత్తేం కాదు. కానీ... ఈమధ్య దర్శకులు కథలపై ఎంత దృష్టిపెడుతున్నారో, కథానాయకుల పాత్రలపైనా అంతే కసరత్తు చేస్తున్నారు. దాంతో అవి ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తున్నాయి. అభిమానుల మనసులతో పాటు... బాక్స్‌ఫీసునూ కొల్లగొడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని