
Cinema News: రెండు చిత్రాలకి క్లాప్
వి.ఆర్.జి.ఆర్ మూవీస్ సంస్థ ఒకే రోజు రెండు చిత్రాల్ని ఆరంభించింది. కొత్త నటులతో ఫిల్మీ గ్యాంగ్‌స్టర్స్ దర్శకత్వంలో ఓ హారర్ చిత్రం రూపొందనుండగా, ‘యూజ్‌లెస్ ఫెలోస్’ పేరుతో మహేష్ గంగిమళ్ల దర్శకత్వంలో మరో చిత్రం రూపొందుతోంది. గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై రెండు చిత్రాల ముహూర్తపు సన్నివేశాలకి క్లాప్‌నిచ్చారు. కాళీకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వై.గంగాధర్, యం.జగన్నాథం, టి.విక్రమ్, జె.ప్రభాకర్‌రావు, వినయ్‌కుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘ఒకేసారి రెండు చిత్రాల్ని నిర్మిస్తూ, ఇద్దరు దర్శకులకి ఎంతోమంది నటులు, సాంకేతిక నిపుణులకి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఈ రెండు చిత్రాలూ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. నిర్మాత జి.వి.నాయుడు మాట్లాడుతూ ‘‘దర్శకులు చెప్పిన కథలు చాలా కొత్తగా అనిపించాయి. విభిన్నమైన నేపథ్యాలతో కూడిన ఈ రెండు చిత్రాలూ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత మాధవ్ కోదాడ, కథానాయిక మిహిర తదితరులు పాల్గొన్నారు.