
Ananya Panday: నాలోని నటికి దారి చూపించారు
‘‘నాలోని అసలు సిసలు నటిని బయటపెట్టడానికి దోహదం చేశారు షకున్‌బత్రా. ఆయన సహాయం వల్లే నాలోని నటిని కొత్తగా తెరపై ఆవిష్కరించగలిగాను’’అంటోంది అనన్యా పాండే. ఈ బాలీవుడ్ యువ కథానాయిక నటించిన తాజా చిత్రం ‘గెహ్రాహియా’. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వలతో కలిసి నటించింది అనన్య. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టకుంటోంది. ఈ సినిమాలో నటించడం గురించి అనన్య మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటివరకూ పలు సినిమాల్లో నటించాను. దర్శకులు చెప్పింది చేసుకుంటూ పోయాను. నా పాత్రను ఎంజాయ్ చేశాను. కానీ ‘గెహ్రాహియా’తో నాలోని నటిని కనుగొన్నాను. దానికి కారణం దర్శకుడు షకున్ బత్రా అందించిన సహాయమే. నటిగా నేను ఎలా ముందు కెళ్లాలో ఓ దారి చూపించారు షకున్. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం సంక్లిష్టమైన ఈ కథ, వాస్తవికతకు దగ్గరగా ఉండే అందులోని పాత్రలే. ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరో, విలన్, హీరోయిన్ ఎవరూ ఉండరు. కథ మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషిలోనూ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మానవ సంబంధాల్లో ఆ రెండింటినీ వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రంలో చూపించారు షకున్. నేను బాగా నటించాను అంటే కారణం నాతోటి నటులు నటనే. వాళ్లు అంత బాగా పాత్రల్లో ఒదిగిపోయారు కాబట్టే నేనూ నాలోని నటిని బయటకు తీయగలిగాను’’అని చెప్పింది అనన్య. ఆధునిక మానవ సంబంధాలతో కథతో అల్లుకున్న ఈ చిత్రం వచ్చే నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.