
Chiranjeevi: రంగంలోకి చిరంజీవి
కొత్త సినిమాలన్నీ ఎక్కడికక్కడే ఆగి పోయాయి. కొవిడ్ కేసుల ఉద్ధృతితో దాదాపుగా అగ్ర తారలు చిత్రీకరణలకి విరామమిచ్చి ఇంట్లోనే గడుపుతున్నారు. సీనియర్ కథానాయకుడు చిరంజీవి మాత్రం సెట్లోకి అడుగుపెట్టారు. ఆయన కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. చిరంజీవి, ఇతర తారాగణంపై యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పూర్తి చేయాల్సిన సినిమాల జాబితా పెద్దదే. ‘భోళాశంకర్’, ‘గాడ్‌ఫాదర్’తోపాటు, బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ‘ఆచార్య’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా పలువురు యువ దర్శకులు ఆయన కోసం మరిన్ని కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదంతా చిరంజీవి బిజీ బిజీగా గడపనున్నారు.