Updated : 24 Jan 2022 05:55 IST

Tollywood: తెర వారసత్వం

2022లోనే అరంగేట్రం

వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది. మెగా కాంపౌండ్‌ నుంచి వైష్ణవ్‌ తేజ్‌, రాజశేఖర్‌ నట వారసురాలిగా శివానీ తెరపై మెరిసి మెప్పించారు. ఇప్పుడు వీరి బాటలోనే ఈ ఏడాదీ పలువురు నట వారసులు వెండితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నారు. సంక్రాంతికి ఇద్దరు వారసులు రాగా... త్వరలో ప్రేక్షకుల్ని పలకరించడానికి మరికొందరు వస్తున్నారు. వారి చిత్ర విశేషాలేంటో చూసేద్దాం పదండి...

తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది ఆరంభం నుంచే నట వారసుల సందడి కనిపించింది. సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాగా.. అందులో రెండు వారసులకు సంబంధించినవే. వీటిలో ఒకటి ‘హీరో’. ఈ సినిమాతోనే సీనియర్‌ హీరో కృష్ణ మనవడు, మహేష్‌బాబు మేనల్లుడైన అశోక్‌ గల్లా కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యారు. శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రమిది. కొత్తదనం నిండిన కమర్షియల్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులకు వినోదాలు పంచిచ్చింది. ‘రౌడీబాయ్స్‌’ చిత్రంతో పెద్ద పండగ బరిలో సందడి చేసిన మరో కొత్త హీరో ఆశిష్‌. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడాయన. శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా.. పండగ బరిలో నిలిచి యువతరాన్ని అలరించింది. ప్రస్తుతం ఆశిష్‌ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌లో చేయనున్నారు. సుక్కు శిష్యుడు కాశీ తెరకెక్కించనున్న ఈ సినిమాకి ‘సెల్ఫిష్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

వీళ్లూ ఉన్నారు...

దగ్గుబాటి కుటుంబం నుంచి ఈ ఏడాది మరో కొత్త హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ఆయనే దగ్గుబాటి అభిరామ్‌. నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు రెండో తనయుడాయన. నటుడు రానాకు సోదరుడు. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో.. ఈ ఏడాది తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టనున్నారు అభి. తేజ శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ‘అహింస’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా సినీప్రియుల్ని పలకరించనున్నారు బెల్లంకొండ గణేష్‌. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో తనయుడాయన. లక్ష్మణ్‌   కె.కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగానే స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథగా ఈ సినిమా సాగనుంది. ఇందులో గణేష్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

* ‘బేకర్‌ అండ్‌ బ్యూటీ’, ‘త్రీరోజెస్‌’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి వెబ్సిరీస్‌లతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించారు సంగీత్‌ శోభన్‌. దర్శకుడు శోభన్‌ తనయుడు, హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడైన సంగీత్‌.. ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాతో వెండితెరపై అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది.


అందరి చూపు.. అటు వైపే

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఎన్నోసార్లు స్పష్టత ఇచ్చారు. ఆయన త్వరలో తెరపైకి వస్తాడని చెబుతున్నారే తప్ప.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’తో చిత్రసీమకు పరిచయం చేస్తానని బాలకృష్ణ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తెలిపారు. ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నట్లు  ప్రకటించారు బాలయ్య. కానీ, అదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది ఆయన ఇప్పటికీ తేల్చి  చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్‌పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని