
నా కోసమే రాసిన కథ
కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథలే చేస్తానన్నారు నట్టి కరుణ. కొన్ని పాత్రల విషయంలో తనకి విజయశాంతి స్ఫూర్తి అన్నారామె. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ ‘డి.ఎస్.జె (దెయ్యంతో సహజీవనం)’తో నటిగా మారారు. ఆమె ప్రధాన పాత్రధారిగా, తండ్రి నట్టి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నట్టి కరుణ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘నటనని ఎక్కడా నేర్చుకోలేదు. లాక్డౌన్ సమయంలో యూ ట్యూబ్‌లో కొన్ని పాటలు చేశా. ఆ ప్రయత్నం చాలా మందికి నచ్చింది. అప్పుడే ఓ సినిమా చేయాలనుకున్నా. నా కోసమే రాసిన కథతో ‘డి.ఎస్.జె’ తెరకెక్కింది. చిత్రీకరణకి కొద్ది రోజులు ముందు వర్క్‌షాప్ చేసి ఆ తర్వాత సెట్స్‌కి వెళ్లాం. హైదరాబాద్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిందీ చిత్రం. కథలోని మలుపులు ఎవ్వరూ ఊహించని రీతిలో ఉంటాయి. మధ్య తరగతి అమ్మాయిగా, మరో రెండు కోణాల్లోనూ నేను కనిపించే తీరు ఆకట్టుకుంటుంది. దెయ్యానికీ, అమ్మవారికీ మధ్య సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో నాకుజోడీగా అంటూ ఎవ్వరూ ఉండరు. స్నేహితులు ఉంటారంతే’’.
* ‘‘ఈ సినిమా చేయడమే ఓ పెద్ద సవాల్. పోరాట ఘట్టాల్లో నటించడం ఓ ప్రత్యేకమైన అనుభవం. ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకడం, తాడు సాయం లేకుండా కారుమీద నిల్చొని కనిపించే సన్నివేశాలు సవాల్‌గా అనిపించాయి. నటన కంటే కూడా డ్యాన్స్ చేయడం ఇంకా కష్టం అనిపించింది. ఇందులో రెండు పాటలు ఉంటాయి. మైనస్ డిగ్రీల చలిలో కశ్మీర్ అందాల మధ్య నృత్యాలు చేయడం కష్టంగా అనిపించింది. సినిమా చూసుకున్నాక నటిగా నాకు సంతృప్తినిచ్చింది. ఇకపై కూడా నాయికా ప్రధానమైన సినిమాలే చేస్తా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. నేను ఏ సినిమా చేసినా అందులో కథానాయిక హావభావాల్ని తదేకంగా పరిశీలిస్తా. సాయిపల్లవి, అనుష్క, విజయశాంతి.... ఇలా ఒకొక్కరిలో ఒక్కో కోణాన్ని గమనిస్తూ వాళ్లని స్ఫూర్తిగా తీసుకుని నటిస్తున్నా’’.
Advertisement