Nadigar Sangam: మళ్లీ పాండవులు గెలిచారు

 ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్‌ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్‌ జట్టు (పాండవర్‌ అని)

Updated : 21 Mar 2022 11:00 IST

భారీ విజయాన్ని దక్కించుకున్న విశాల్‌ జట్టు 
కౌంటింగ్‌ మధ్యలో వాకౌట్‌ చేసిన భాగ్యరాజ్‌ టీం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్‌ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్‌ జట్టు (పాండవర్‌ అని) విజయం సాధించింది. వారికిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు ఈ లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కౌంటింగ్‌ నుంచి భాగ్యరాజ్‌ జట్టు వాకౌట్‌ చేసింది. 2019, జూన్‌ 23న దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) ఎన్నికలు జరిగాయి. సీనియర్‌ దర్శక నటుడు భాగ్యరాజ్‌ సారధ్యంలో ‘స్వామి శంకరదాస్‌’ జట్టు, నాజర్‌-విశాల్‌ సారధ్యంలో ‘పాండవర్‌ అని’.. జట్లు పోటీ చేశాయి. కొన్ని కారణాల వలన, ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కారణంగా.. అసలు ఈ ఎన్నికలు చెల్లవని, కౌంటింగ్‌ ప్రక్రియను నిషేధించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పోలింగ్‌ బాక్సులను నుంగంబాక్కంలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికలు చెల్లవని ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ విశాల్‌- నాజర్‌ జట్టు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీంతో ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, ఎన్నికలు చెల్లుతాయని, కౌంటింగ్‌ ప్రక్రియ జరపవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. అయితే తీర్పును సవాలుచేస్తూ ఏళుమలై అనే సహాయ నటుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా, పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

ఆనాటి ఉత్సాహంతో..

న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంగంబాక్కంలోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాలలో జరిగింది. దాదాపు రెండేళ్ల క్రితం నాటి ఎన్నికలే అయినా.. ఇరు జట్లు అనాటి ఉత్సాహంతో కౌంటింగ్‌ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎన్నికల అధికారి, నటీనటుల సంఘం ప్రత్యేక అధికారుల సమక్షంలో కౌంటింగ్‌ చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విశాల్‌ జట్టు (పాండవర్‌ అని) విజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాజర్‌ ఘన విజయం సాధించారు. ఆయనకు 1,701 ఓట్లు లభించగా, భాగ్యరాజ్‌కు 1054 ఓట్లు దక్కాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్‌ 1720 ఓట్లు సొంతం చేసుకోగా, ఐసరి గణేశ్‌కు 1,032 ఓట్లు పడ్డాయి. దీంతో విశాల్‌ మళ్లీ విజయం సాధించారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన కార్తికి 1827, ప్రశాంత్‌కు 919 ఓట్లు వచ్చాయి. 908 ఓట్ల వ్యత్యాసంతో కార్తి గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసిన కరుణాస్‌కు 1,605 (పాండవర్‌ అని), కుట్టి పద్మినికి 1,015 (శంకరదాస్‌ జట్టు), పూచ్చి మురుగన్‌ 1,612 (పాండవర్‌ అని), ఉదయకు 973 (శంకరదాస్‌ జట్టు) ఓట్లు దక్కాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ పాండవర్‌ అని విజయం సాధించింది. అంటే వరుసగా రెండు సార్లు గెలుపు గుర్రాలై నిలిచారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు వీళ్లు పదవిలో కొనసాగుతారు. 

భవనం పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం

‘‘2015 నుంచి 2019 వరకు ‘నడిగర్‌ సంఘం’ చరిత్రలో కీలకమైన రోజులు. సభ్యులకు దక్కిన సంక్షేమ పథకాలు, దాదాపు 70శాతం పూర్తయిన సంఘం భవన నిర్మాణ పనులు.. వంటి విషయాలు మా జట్టుకు దక్కిన గౌరవ ప్రతీకలు. కానీ రెండేళ్ల పాటు ఆ పనులు ఆగిపోయాయి. మేం చాలా బాధపడ్డాం. దాదాపు రెండేళ్ల తర్వాత న్యాయపోరాటంతో తిరిగి విజయం దక్కింది. ఇది అసాధారణమైన విజయం! ఆ భవనాన్ని పూర్తి చేస్తాం. తద్వారా వచ్చే ఆదాయం తదుపరి తరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.’’- నటుడు కార్తి (కోశాధికారిగా గెలిచిన అభ్యర్థి)

లెక్కింపుపై అసంతృప్తి

కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న భాగ్యరాజ్, ఆయన జట్టులోని ఐసరి గణేశ్‌లు ప్రారంభం నుంచే తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. నమోదైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీంతో కాసేపు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. మళ్లీ కౌంటింగ్‌ మొదలవడంతో భాగ్యరాజ్‌ జట్టు సభ్యులు అక్కడి నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్ల కన్నా 100 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని,  లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని