కాసులుంటే తప్ప... కన్ను ఎత్తి చూడరబ్బో

‘డబ్బులోన ఉన్నదిరా లోకమంతా అది లేని వాడి బతుకంతా ఒకటే చింతా’  ‘చక్రవర్తికీ వీధి భిచ్ఛగత్తెకీ బంధువుతాననీ  అంది మనీ మనీ’ ‘రైలు బండిని నడిపేది పచ్చజెండాలే బతుకు బండిని నడిపేదీ పచ్చనోటే లే’

Published : 26 Mar 2022 06:20 IST

‘డబ్బులోన ఉన్నదిరా లోకమంతా

అది లేని వాడి బతుకంతా ఒకటే చింతా’ 

 ‘చక్రవర్తికీ వీధి భిచ్ఛగత్తెకీ బంధువుతాననీ  అంది మనీ మనీ’ 

‘రైలు బండిని నడిపేది పచ్చజెండాలే బతుకు బండిని నడిపేదీ పచ్చనోటే లే’

ఇలా బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి నేటి రంగుల ప్రపంచం వరకు ఎప్పటికప్పుడు డబ్బు పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఎఫ్‌3’లోనూ ఇలాంటి పాట ఒకటుంది. ఇటీవలే విడుదలై శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆ పాట ప్రయాణం గురించి గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే...‘‘డబ్బు చుట్టూ తిరిగే కథ. డబ్బు మీద చాలామంది చాలా రకాలుగా రాసేశారు. అయినా సరే, డబ్బు తన అవసరాన్ని కొత్తగా చూపిస్తూనే ఉంటుంది. మనలో రకరకాల కోరికలు పుట్టడం, విలాసాలపై మోజు కలగడమో లేదంటే ఆలోచనల పరిధి పెరగడంతోనో, ఇంకొకళ్లని చూసి వాళ్లలా గడపాలనుకోవడం వల్లో... ఇలా తరచూ లేని పోని అవసరాల్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలోని అన్ని పాత్రలూ డబ్బుతో ముడిపడే ఉంటాయి. కథ ఇదీ అని సూత్రప్రాయంగా తెలపడంలో భాగంగా వచ్చే పాట ఇది. సినిమాలో చాలా సందర్భాల్లో వినిపిస్తుంటుందని చెప్పారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. నాకు ఆయన రచయితగా, సహ దర్శకుడిగా పనిచేసేటప్పటి నుంచే పరిచయం. ‘ఎఫ్‌2’కే మేం కలిసి పనిచేయాలి. అది ఇప్పటికి కుదిరింది. ‘ఇందులో చిన్న వెటకారంతో కూడిన ఫన్‌ ఉండాలి, అదే సమయంలో వాస్తవం అనిపించాల’ని ఆయన చెప్పడంతో ‘లబ్‌ డబ్‌...’ అంటూ కొత్త సౌండింగ్‌ వినిపించేలా పాట మొదలుపెట్టా. డబ్బుంటే ఆడిందే ఆట అంటాం కదా, దాన్ని గుర్తు చేస్తూ ‘పైస ఉంటే లోకమంతా పెద్ద డాన్స్‌ క్లబ్బో’ అంటూ రాశా పల్లవిలో. డబ్బు అనేది ఓ మంత్రదండమని చెప్పడంలో భాగంగా... ‘పాకెట్‌లోన పైసా ఉంటే, ప్రపంచమే పిల్లవుతుంది, పులై మనం బతికేయొచ్చు’ అనేశాం. బ్యాంక్‌ల్లో కొత్త నోట్లు ఇస్తే వాటి నుంచి వచ్చే వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ‘ఏ పర్ఫ్యూమ్‌ ఇవ్వలేని కమ్మనైన స్మెల్‌నిచ్చే అత్తరురా డబ్బు...’ అంటూ కొత్త వ్యక్తీకరణని ఆవిష్కరించా.

* డబ్బు కోసం పాట్లు పడుతూ, రకరకాలుగా ఆలోచిస్తుంటాయి పాత్రలు. అందుకే తొలి చరణంలో వెటకారాన్ని జోడిస్తూ ‘మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా, దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాలా’ అని రాశా. ఇందులోని పాత్రల అత్యాశని చెప్పేందుకే ఆ చెట్టు నుంచి డబ్బు రాలాలా అని ఆ అతిశయోక్తిని ఉపయోగించా. అంతకుముందు వాళ్ల చరిత్ర ఏదైనా ఉండొచ్చు, ఊళ్లోకి వెళ్లి ఓ ఖరీదైన కార్లో నుంచి దిగితే అందరూ ఆ దర్జాతనాన్నే చూస్తారు తప్ప, గతాన్ని అంతగా పట్టించుకోరు. అందుకే ‘చేతుల్లోనా క్యాషే ఉంటే ఫేసులోకి గ్లో వస్తుందీ, ‘ఫ్లాష్‌ బ్యాక్‌ చెరిపెయ్యొచ్చూ.. విశ్వదాభిరామా’ అని రాశా.  

* రెండో చరణానికి వచ్చేసరికి కోరుకున్న డబ్బు వచ్చేస్తుందని అర్థమవుతుంది. అప్పుడు కోరికలూ అందుకు తగ్గట్టే పెరుగుతాయి కాబట్టి ‘కారు బంపరైనా బంగారందె ఉండాలా... కొత్తి మీరకైనా అందులోనె వెళ్ళాలా’ అని రాశా. ‘దరిద్రాన్ని డస్ట బిన్‌లోనే విసిరికొట్టే టైమొచ్చిందీ, అదృష్టమే ఆన్‌ ది వేరా... విశ్వదాభిరామా’ అని కొత్త వ్యక్తీకరణని రెండో చరణంలో ఉపయోగించా.


* ఆఖర్లో రూ.2 వేల నోటు ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. సినిమాలో పాత్రలన్నీ దాన్ని చూస్తూ, పూనకంతో ఆవాహనం చేసుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సందర్భంలో ఓ ర్యాప్‌ వినిపించాలని దర్శకుడు చెప్పారు. అప్పుడు చివరి లైన్స్‌ రాశా. అవి ఆయనకి చాలా బాగా నచ్చాయి. రచయితగా ఈ పాట నాకు మంచి అనుభూతినిచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్‌ సిద్ధం చేశాక, దర్శకుడు ఒక్క రోజులో పాట కావాలన్నారు. దీపావళి రోజు మా ఇంటి దగ్గర కింద టపాసులు పేలుతుంటే పైన పాట రాసుకుంటూ కూర్చున్నా. రామ్‌ మిర్యాల చాలా బాగా పాడారు. దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్‌ అదిరిపోయింది. దర్శకుడు సెట్‌కి పిలిచి మీ పాట ఇలా తీస్తున్నాం అని చూపించారు. విడుదల తర్వాత పాటకి చాలా మంచి స్పందన వచ్చింది’’.

కొత్త పాట
చిత్రం: ఎఫ్‌3
రచన: భాస్కరభట్ల రవికుమార్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
గానం: రామ్‌ మిర్యాల

పల్లవి: లబ్‌ డబ్‌, లబ్‌ డబ్‌, లబ్‌ డబ్‌ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గానీ, దీన్ని అబ్బో
క్యాష్‌ లేని లైఫే, కష్టాల బాత్‌ టబ్బో
పైస వుంటే లోకమంతా పెద్ద డ్యాన్స్‌ క్లబ్బో
లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గానీ, దీన్ని అబ్బో
కాసులుంటే తప్ప, కన్ను ఎత్తి చూడరబ్బో
చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో
ఏ పాకెట్‌లో పైసా వుంటే,
ప్రపంచమే పిల్లవుతుంది
పులై మనం బతికేయొచ్చు విశ్వదాభిరామ
వాలెట్‌లోన సొమ్మే వుంటే,
వాకిట్లోకి వరల్డే వచ్చి
సలాం కొట్టే మామా, వినరా వేమ
అరె గల్లా పెట్టెకేమో, గజ్జల్‌ కట్టినట్టు
ఘల్‌ ఘల్‌ మోగుతుంది డబ్బు
ఏ పర్ఫ్యూమ్‌ ఇవ్వలేని, కమ్మనైన స్మెల్‌ నిచ్చే అత్తరురా డబ్బు
అరె తెల్లా మబ్బునైనా, నల్లా మబ్బు చేసి
వానల్లే మార్చుతుంది డబ్బు
లేని గట్సు లోడెడ్‌ పర్సు ఇవ్వదా 
।। లబ్‌ డబ్‌ ।।

చరణం: 1
మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా
దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాలా
హ్యాకర్స్‌ తోటి పొత్తుపెట్టుకోవాలా
ఆన్‌లైన్‌లోన అందినంత నొక్కాలా
ఎవడినెత్తినైన మనం చెయ్యి పెట్టాలా
అడ్డదారిలోన ఆస్తి కూడబెట్టాలా
ఎన్ని స్కాములైన తప్పు లేదు గోపాలా
ఒక్క దెబ్బతోటే లైఫ్‌ సెటిల్‌ అవ్వాలా
హే చేతుల్లోనా క్యాషే వుంటే ఫేసులోకి  గ్లో వస్తుందీ
ఫ్లాష్‌బ్యాక్‌ చెరిపెయ్యొచ్చూ విశ్వదాభిరామా
పచ్చనోటు మనతో వుంటే...
రెచ్చిపోయె ఊపొస్తుందీ
కుట్టదంట చీమా... వినరా వేమా 
।। లబ్‌ డబ్‌ ।।

చరణం: 2
అరే అంబానీ బిల్‌ గేట్స్‌ బిర్లాలా
లెక్కకందనంత డబ్బులోన దొర్లాలా
కారు బంపరైన బంగారందె వుండాలా
కొత్తిమీరకైన అందులోనె వెళ్ళాలా
ఇప్పుడెందుకింక తగ్గి తగ్గి వుండాలా
లక్ష బిల్లు అయితె టిప్పు డబల్‌ కొట్టాలా
మనం ఎంత రిచ్చో దునియాకి తెలియాలా
జనం కుళ్ళికుళ్ళి ఏడ్చుకుంటూ చావాలా

హే దరిద్రాన్ని డస్ట్‌ బిన్‌లో విసిరికొట్టే టైమొచ్చిందీ
అదృష్టమే ఆన్‌ ది వే రా... విశ్వదాభిరామా
కరెన్సీయే ఫియాన్సీలా.. ఒళ్ళో వాలిపోతానందీ
రొమాన్సేగా రోజూ... వినరావేమా  
।। లబ్‌ డబ్‌ ।।

రా, దిగిరా
నిన్ను సంచుల్లో కట్టేసి గుంతల్లో కప్పేసి
దాచేస్తే దండెత్తిరా రా, దిగిరా
ఊపిరాడకుండా చీకట్లో చెమటట్టిపోతావు
స్విస్‌ బ్యాంకు గోడ దూకి రా
బలిసున్నోళ్ల కొంపల్లో, సీక్రెట్టు లాకర్లు బద్దల్‌ కొట్టుకుంటూరా
నీకు ప్రాణాలు ఇచ్చేటి ఫ్యాన్సిక్కడున్నారు
బుల్లెట్టు బండెక్కిరా 
।।రా దిగిరా।।

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని