సిక్స్‌ కొట్టిన ‘డ్యూన్‌’

ఇదేంటి... ఐపీఎల్‌ శీర్షిక సినిమా పేజీలో అనుకుంటున్నారా? కాదండీ బాబు. కాస్త ఓపికగా చదవండి... ‘డ్యూన్‌’, ‘డ్యూన్‌’, ‘డ్యూన్‌’.. ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్కువగా వినబడిన చిత్రం పేరిది. ఒకటి కాదు రెండు కాదు.. 10 విభాగాల్లో నామినేట్‌

Updated : 29 Mar 2022 05:37 IST

ఇదేంటి... ఐపీఎల్‌ శీర్షిక సినిమా పేజీలో అనుకుంటున్నారా? కాదండీ బాబు. కాస్త ఓపికగా చదవండి... ‘డ్యూన్‌’, ‘డ్యూన్‌’, ‘డ్యూన్‌’.. ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్కువగా వినబడిన చిత్రం పేరిది. ఒకటి కాదు రెండు కాదు.. 10 విభాగాల్లో నామినేట్‌ అయిన ఈ సినిమా ఆరు అవార్డులు సొంతం చేసుకుని ఈ ఏడాది ఆస్కార్‌ వేదికపై విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ చిత్రంగా ఈ ఏడాది ఆస్కార్‌ గెలుపొందిన ‘కొడా’ని పక్కకి నెట్టి.. ఎడిటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, ఒరిజినల్‌ స్కోర్‌ ఇలా ఆరు విభాగాల్లో తన సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ‘డ్యూన్‌’ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం..!

ఫిక్షనల్‌ కథలతో ఎంతోమంది పాఠకుల హృదయాలు గెలుచుకున్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఫ్రాంక్‌ హెర్బర్ట్‌. ఆయన రచించిన ఎన్నో కథలు విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా ‘డ్యూన్‌’. 1965లో ప్రచురితమైన ఈ నవలకు పాఠకులు ఎంతగానో ఆకర్షితులయ్యారు. రెండు సంపుటాలుగా విడుదలైన ఈ నవలను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు డెన్ని విల్లెవ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘డ్యూన్‌’. తిమోతీ చలమెట్‌, రెబెక్కా ఫెర్గూసన్‌, ఆస్కార్‌ ఐజాక్‌, జోష్‌ బ్రోలిన్‌ వంటి హాలీవుడ్‌ తారలు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. 10,191 సంవత్సరంలో ఈ కథ జరుగుతున్నట్లు మనకు చెబుతారు. విశ్వంలోని రెండు వేర్వేరు గ్రహాల మధ్య సాగే కథ ఇది. దీంట్లో పాల్‌ అట్రీడెస్‌ (తిమోతీ చలమెట్‌) అనే ఓ తెలివైన కుర్రాడు ఉంటాడు. అతను పుట్టుకతోనే అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తి. ఓ ప్రమాదకర గ్రహంలోని ఇసుకలో ఉన్న లోహాన్ని చేజిక్కించుకుంటే.. విశ్వంలోని అన్ని గ్రహాలు తమ సొంతమవుతాయనే విశ్వాసం అందరిలో ఉంటుంది. పాల్‌ తన కుటుంబంతో పాటు సమస్త మానవాళి మనుగడ కోసం విశ్వంలోని అత్యంత ప్రమాదకరమైన ఆ ఎడారి గ్రహానికి ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో  అతనికి ఎదురైన సవాళ్లేంటి? ఆ గ్రహంలోని దుష్టశక్తులతో అతనెలా పోరాటం చేశాడు? అన్న ఆసక్తికరమైన అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది  అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్రాంక్‌ హెర్బర్ట్‌ రచించిన ‘డ్యూన్‌’ కథకు న్యాయం చేసేలా ఈ సినిమా ఉందని అందరూ ప్రశంసల వర్షం   కురిపించారు. 16.5 కోట్ల యూఎస్‌ డాలర్లతో రూపుదిద్దుకున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 40.05 కోట్ల యూఎస్‌ డాలర్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

పది విభాగాల్లో గట్టి పోటీనిచ్చి
సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో  నటీనటులతోపాటు గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేస్తారనే సంగతి తెలిసిందే. విజువల్స్‌, గ్రాఫిక్స్‌ చక్కగా కుదిరితే సినిమా కొంతవరకూ విజయం సాధించినట్టే. అదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు దర్శకుడు డెన్ని విల్లెవ్‌. పేరుపొందిన నటీనటులతో పాటు మాంచి టెక్నికల్‌ టీమ్‌ని తన బృందంలోకి తీసుకుని ‘డ్యూన్‌’ని తెరకెక్కించారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ హంగులు, చూపుతిప్పుకోనివ్వని పోరాట ఘట్టాలతో సాగుతుందీ చిత్రం. విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఈ ఏడాది 10 విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలబడింది. ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ చిత్రానికి అన్నింటా గట్టి పోటీ ఇచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్కోర్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌ అవార్డులు అందుకోగా.. ఉత్తమ చిత్రం, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, కాస్ట్యూమ్‌ డిజైన్‌, మేకప్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌.. ఈ విభాగాల్లో అవార్డులను  చేజార్చుకుంది.

వచ్చే ఏడాది మరో భాగం
‘డ్యూన్‌’ నవలలోని రెండో భాగాన్ని ఆధారంగా చేసుకుని ‘డ్యూన్‌-2’ రూపొందించడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఇప్పటికే చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో    ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని