Cinema News: సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ఆట సందీప్‌ కథా  నాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేంజ్‌రోవర్‌’. మేఘనరాజ్‌ కథానాయిక. ఓ.ఎస్‌.ఆర్‌.కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా.....

Updated : 19 May 2022 06:49 IST

ట సందీప్‌ కథా  నాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేంజ్‌రోవర్‌’. మేఘనరాజ్‌ కథానాయిక. ఓ.ఎస్‌.ఆర్‌.కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫస్ట్‌లుక్‌ని నటుడు అలీ ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా పేరు బాగుంది. లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుందనే నమ్మకం ఉంద’’న్నారు. త్వరలోనే ట్రైలర్‌నీ, పాటల్ని విడుదల చేస్తామన్నారు దర్శకనిర్మాత. అరవింద్‌ యతిరాజ్‌, బ్యాంక్‌ జనార్దన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్‌.


నవ్విస్తూ.. థ్రిల్‌ చేస్తూ

సంపత్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘సురాపానం’. మట్ట మధు యాదవ్‌ నిర్మించారు. ప్రగ్యా నయన్‌ కథానాయిక. అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్‌ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘హీరో చేసిన ఒక పొరపాటు వల్ల కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మరి వాటిని అతనెలా దాటొచ్చాడు? ఎదురైన సవాళ్లేంటి? అన్నది దీంట్లో థ్రిల్లింగ్‌గా చూపించాం. వినోదానికి ఎంతో ప్రాధాన్యముంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఠాగూర్‌.


మాస్‌ కథతో కార్తీ..

గ్రామీణ నేపథ్యంగా సాగే పక్కా మాస్‌ కథతో   ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కార్తీ. తను నటిస్తున్న తాజా చిత్రం ‘విరుమన్‌’. కార్తీతో గతంలో ‘కొంబన్‌’ తీసిన ఎమ్‌ ముత్తయ్య ‘విరుమన్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 31న ఈ సినిమాను విడుదల   చేస్తున్నట్లు కార్తీ ట్వీట్‌ చేశాడు. లుంగీ కట్టుకుని వేట కొడవలితో ఉన్న తన లుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు. స్టార్‌ దర్శకుడు శంకర్‌ తనయ అదితి ఇందులో కథానాయికగా నటిస్తుండటం విశేషం. 2 డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎస్‌.కె సెల్వ కుమార్‌, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని