Rajashekar: మా బతుకు తెరువును బతికించండి - రాజశేఖర్‌

‘‘కొవిడ్‌ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. డెత్‌ బెడ్‌ నుంచి తిరిగొచ్చి సినిమా చేయగలిగానంటే దానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదాలే. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి నన్ను బతికించి నట్లే..

Updated : 19 May 2022 06:54 IST

‘‘కొవిడ్‌ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. డెత్‌ బెడ్‌ నుంచి తిరిగొచ్చి సినిమా చేయగలిగానంటే దానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదాలే. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి నన్ను బతికించి నట్లే.. నా చిత్రాన్ని చూసి మా బతుకు తెరువును మళ్లీ  బతికించండి’’ అన్నారు రాజశేఖర్‌. ఆయన హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఆత్మీయ రాజన్‌, ముస్కాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  దర్శకుడు సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజశేఖర్‌ చేసిన ‘ఆహుతి’, ‘ఆగ్రహం’, ‘తలంబ్రాలు’, ‘మగాడు’, ‘అంకుశం’ వంటి హిట్‌ చిత్రాలు చూసి నేను ఆయనకు వీరాభిమానినయ్యా. సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనే ఆలోచన నాలో ఏర్పడటానికి కారణం ఆయనే. ఇలా నా సినిమా జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ఆయనకు థ్యాంక్స్‌. మనం చిత్ర పరిశ్రమలో ఉంటూ డబ్బులు, పేరు సంపాదిస్తూ.. పిల్లల్ని, కుటుంబాన్ని మాత్రం ఇండస్ట్రీకి దూరం పెడుతుంటాం. ఆయన తన ఇద్దరమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. చాలా గ్రేట్‌. తన కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం. జీవిత దాన్ని చేసి చూపారు. ఈ సినిమా ఆమె కోసమైనా పెద్ద సక్సెస్‌ కావాలని  కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం నాకంటే జీవితే ఎక్కువ కష్టపడింది. ఆ కష్టం తెరపై మీకు కనిపిస్తుంది. అనూప్‌ వల్లే ఈ  చిత్రానికి ఇంత పేరొచ్చింది. థియేటర్‌కు వచ్చి మా చిత్రం చూడండి’’ అన్నారు రాజశేఖర్‌. దర్శకురాలు జీవిత మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి టికెట్‌ రేట్స్‌ పెంచడం లేదు. మా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ వర్మ, రాజ్‌ తరుణ్‌, విజయ్‌ భాస్కర్‌, అనూప్‌ రూబెన్స్‌, శివాని, శివాత్మిక, మహేంద్ర, జ్ఞానసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని