Major: చిక్కులన్ని కూర్చి.. లెక్కలేవో నేర్చి

‘‘హాయి హాయి హాయి.. ఈ మాయ ఏమిటోయి.. గుండె ఆగి ఆగి ఎగురుతున్నది. చిక్కులన్ని కూర్చి.. ఓ లెక్కలేవో నేర్చి.. అంకెలాటలేవో ఆడుతున్నది’’ అంటూ ప్రేయసిని  తలచుకుంటూ ప్రేమ పాట పాడుకుంటున్నారు అడివి శేష్‌.

Updated : 19 May 2022 06:57 IST

‘‘హాయి హాయి హాయి.. ఈ మాయ ఏమిటోయి.. గుండె ఆగి ఆగి ఎగురుతున్నది. చిక్కులన్ని కూర్చి.. ఓ లెక్కలేవో నేర్చి.. అంకెలాటలేవో ఆడుతున్నది’’ అంటూ ప్రేయసిని  తలచుకుంటూ ప్రేమ పాట పాడుకుంటున్నారు అడివి శేష్‌. మరి ఆయన మనసుదోచిన ఆ సుందరి ఎవరు? వారి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే ‘మేజర్‌’ చూడాల్సిందే.  26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో రూపొందిన చిత్రమిది. టైటిల్‌ పాత్రను శేష్‌ పోషించారు. శశికిరణ్‌ తిక్క తెరకెక్కించారు. సయీ  మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమా జూన్‌ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్రం నుంచి ‘‘ఓహ్‌ ఇషా’’ వీడియో గీతాన్ని విడుదల చేశారు. సందీప్‌ తన తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భంలో వచ్చే మెలోడీ గీతమిది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చారు. రాజీవ్‌ భరద్వాజ్‌ సాహిత్యమందించారు. అర్మాన్‌ మాలిక్‌, చిన్మయి శ్రీపాద సంయుక్తంగా ఆలపించారు. మేజర్‌ సందీప్‌ బాల్యం, యవ్వనం, సైన్యంలో చేరి ఆయన చేసిన సాహసాలు, ముంబయి ఉగ్ర దాడిలో వీరమరణం చెందడం.. వంటి అన్ని అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో శోభితా ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. దీన్ని మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని