‘మేజర్‌’ సంగీత దర్శకుడిగా గర్వపడుతున్నా

సినిమాని వాటి నిర్మాణ వ్యయం ఆధారంగా చూడను. కథ ఎలా ఉంది? దానికి తగ్గ బాణీలు ఇవ్వగలనా అనేదే చూస్తాను. ‘డి.జె.టిల్లు’ తర్వాత ‘మేజర్‌’ చిత్రానికి సంగీతం చేయడం గొప్పగా భావిస్తున్నా. అడవిశేష్‌, నేను దాదాపు ఇద్దరం ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం. మొదటిసారి ‘కిస్‌’ చేశాం. అది అనుకున్నంతగా ఆడలేదు

Published : 26 May 2022 02:07 IST

‘‘నా సినీ ప్రయాణంలో తొలి అడుగుల్లోనే బయోపిక్‌కి పనిచేయడం ఓ గొప్ప అనుభవం, సంతృప్తినిచ్చింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల. ఆయన ‘మేజర్‌’ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్‌ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లో.

* సినిమాని వాటి నిర్మాణ వ్యయం ఆధారంగా చూడను. కథ ఎలా ఉంది? దానికి తగ్గ బాణీలు ఇవ్వగలనా అనేదే చూస్తాను. ‘డి.జె.టిల్లు’ తర్వాత ‘మేజర్‌’ చిత్రానికి సంగీతం చేయడం గొప్పగా భావిస్తున్నా. అడవిశేష్‌, నేను దాదాపు ఇద్దరం ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం. మొదటిసారి ‘కిస్‌’ చేశాం. అది అనుకున్నంతగా ఆడలేదు. ‘క్షణం’ తర్వాత మా ప్రయాణం బాగుంది. తర్వాత ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్‌... ఇలా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు శశికిరణ్‌ కథ చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. ‘మేజర్‌’లో ప్రేమకథ, పాటలు, నేపథ్య సంగీతం... అన్నింటికీ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే పాటలు చాలా ఆదరణ పొందాయి. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నా.

* డ్రామా, యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలకి చోటున్న కథ. నేను ఇదివరకు థ్రిల్లర్‌ సినిమాలకి పనిచేశా, వాణిజ్య ప్రధానమైన సినిమాలూ చేశా. ‘మేజర్‌’ భావోద్వేగాలతో కూడిన సినిమా. 1990నాటి కథ ఉంది కాబట్టి అప్పటి సంగీతం బాగా రావడానికి ప్రయత్నించా. స్వతహాగా నాకు 90లనాటి పాటలు, సంగీతం అంటే చాలా ఇష్టం. తెలుగు కంటే హిందీ భాషకి బాణీలు సమకూర్చడం కొంచెం క్లిష్టంగా అనిపించింది. వ్యక్తిగతంగా పాటలకి తగ్గట్టుగా బాణీలు కట్టడం ఇష్టం. నేపథ్య సంగీతం చేయడం ఓ ప్రత్యేకమైన కిక్‌నిస్తుంది.

* సంగీతపరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటా. సంగీతానికి సాహిత్యం చాలా ముఖ్యం. పాటకి సరిపడేలాగే శబ్దం ఉండాలనేది నేను నమ్మే ప్రధాన నియమం. ప్రస్తుతం నరేష్‌ చిత్రం ‘మారేడుమిల్లి ప్రజానీకం’తోపాటు... ‘క్షణం’ దర్శకుడితో ఓ సినిమా, ‘గూఢచారి2’, ‘తెలిసినవాళ్లు’ చిత్రాలు చేస్తున్నా. ఓ కన్నడ సినిమా కూడా చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని