Updated : 28 May 2022 08:12 IST

తెలుగు.. తెరకు వెలుగు

కారణజన్ముడు... యుగ పురుషుడు... మేటినటుడు... మహానాయకుడు... ఈ మాటలన్నీ ఎన్టీఆర్‌ కోసమే పుట్టాయేమో! వాటికి అర్హులైన వ్యక్తి ఆయన తప్ప మరొకరు కనిపించరు మరీ! తెలుగు నేలకి.. తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం పేరు... ఎన్టీఆర్‌. పగలైనా రేయైనా ఇంకొన్ని రాలైనా నిత్యం ప్రకాశించే ఓ తారక పేరు... ఎన్టీఆర్‌. ఆ మూడక్షరాలు చాలు... తెలుగు వాడి హృదయం గర్వంతో పొంగిపోవడానికి! ఆ మూడక్షరాలు చాలు...  స్ఫూర్తిని నింపుకొని ధైర్యంగా అడుగేయడానికి! కళల్లోనైనా, సేవల్లోనైనా... వ్యక్తిగా మార్గదర్శకంగా నిలవడంలోనైనా ఆయనకి సాటిగా నిలిచే పేరు మరొకటి వినిపించగలదా? అందుకే ఆయన యుగ పురుషుడు అనిపించుకున్నారు. కథానాయకుల్ని మించిన కథానాయకులు, పాలకుల్ని మరిపించే పాలకులు... ఇలా దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందేమో కానీ ఎన్టీఆర్‌ మాత్రం ఒక్కరే! దర్శకుడు, రచయిత, ప్రేక్షకుడు తృప్తిచెందే వరకు అభినయించిన అరుదైన అపురూపమైన నటుడాయన. చిలక కొట్టుడు కొడితే.. అంటూ ‘యమగోల’ చేసినా..., పుణ్యభూమి నాదేశం నమో నమామి.. అంటూ మేజర్‌చంద్రకాంత్‌లా దేశభక్తి చాటినా..., ఏమంటివి... ఏమంటివి? అంటూ దుర్యోధనుడిలా సాక్షాత్కరించినా..., కృష్ణుడిలా లాలించినా.. రాముడిలా పాలించినా... బొబ్బిలిపులిలా గాండ్రించినా... జస్టిస్‌ చౌదరిలా గర్జించినా... ఇలా ఆయన సినిమాలు... పోషించిన పాత్రలు తెలుగు తెరపై వెలుగులు నింపినవే. ఎన్టీఆర్‌ శత జయంతి వసంతంలోకి అడుగుపెట్టిన ఈ వేళ తెలుగువారికి పండగ రోజు.


ఎన్ని వసంతాలు గడిచినా ఇగిరిపోని గంధం
- నటుడు రాజేంద్రప్రసాద్‌

‘ఎన్టీఆర్‌ జీవితం ఊరగాయలాంటిది. ఊరేకొద్దీ ఆ రుచి, శక్తి పెరిగినట్టుగా.. ఎన్ని వసంతాలు గడిచినా ఎన్టీఆర్‌ పేరు ఇంకా గొప్పగా వినిపిస్తుందే తప్ప మరిచిపోయే అవకాశమే లేదు. తెలుగు జాతి ఉన్నంతవరకు నందమూరి తారక రామారావు ఉంటారు. ఒక జాతికి గౌరవాన్ని ఆపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని కోణాల్లో చూసినా అంత మహానుభావుడిగా కనిపించే అరుదైన వ్యక్తి. నటుడిగా ఎన్టీఆర్‌ ఎంత స్ఫూర్తినిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువ. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, దూరదృష్టి, ఓపిక... ఈ విషయాల్లో ఎన్టీఆర్‌కి మరొకరు సాటిరారు. ఆయన ఇప్పుడు ఉండుంటే బంగారు పూలతో పాదపూజ చేసుండేవాణ్ని’.  
* ‘మా నాన్న బడి పంతులుగా నిమ్మకూరుకు బదిలీ అయితే, ఆ ఊళ్లో ఎన్టీఆర్‌ ఇంటి కాంపౌండ్‌లోనే ఉన్న మరో పెంకుటిల్లులో మేం ఉన్నాం. అక్కడే నేను పుట్టి పెరిగాను. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక నాకు నటనలో ఆసక్తి ఉందని చెబితే... మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించింది ఎన్టీఆరే. అక్కడ చదువుకోవడం, సెలవు రోజుల్లో ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా సెట్‌కి వెళ్లడం ఇదే నా పని. కెరీర్‌ ప్రారంభమైన తొలి రోజుల్లో ఎదురు పడినప్పుడు ‘ఏం సాధించారు?’ అని అడిగేవారు.   ఇప్పుడిప్పుడే హీరోగా నటిస్తున్నానని చెబితే... ‘ముందు మీకంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకోండి. మనం తిన్నా తినకపోయినా కాళ్లు కడుపులో పెట్టుకుని పడుకోవచ్చు’ అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ:2 కి కిలో బియ్యం, పక్కా గృహాల పథకాల్ని ప్రవేశపెట్టడం వంటివి... తోటి వారిపై, సమాజంపై ఆయనకుండే ప్రేమను చాటుతాయి’’.
* ‘నేను, బ్రదర్‌ ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు... ఇలా మాకంటూ ఓ శైలి ఉంది, పరిశ్రమలో మీరూ నిలబడాలంటే మీకంటూ ఓ శైలి ఉండాల’ని చెప్పి నాకు మార్గదర్శనం చేశారు ఎన్టీఆర్‌. కథానాయకుడిగా నేను విజయవంతంగా సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన్ని కలిసినప్పుడు ‘బ్రహ్మాండంగా నవ్విస్తున్నారట, చాలా సంతోషం. నిన్ను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించినందుకు గర్వపడుతున్నాం’ అన్నారు. నా జీవితంలో ప్రతీ దశలోనూ ఆయన  నుంచి ప్రోత్సాహకరమైన మాట, జీవితానికి ఉపయోగపడే మాట రావడం నా అదృష్టం.
* ఆయనకి నిర్మాణ వ్యయం పెరిగితే చాలా కోపం. బడ్జెట్‌లు ఎంత చేస్తున్నారు? సినిమాలు ఉదయం ఎన్నింటికి మొదలు పెడుతున్నారు? అని అడిగేవారు.
* నేను కథానాయకుడయ్యాను, విజయాలు అందుకున్నాను, నిలదొక్కుకున్నాను కానీ ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రాలేదు. ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చేస్తున్నారని తెలిసి దర్శకుడు బాపు దగ్గరికి వెళ్లా.  అప్పటికి ఆయనతో ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘పెళ్లిపుస్తకం’ చేసిన చనువు ఉంది. నా కోరిక కోరికగానే మిగిలిపోకూడదంటే నేను పెద్దాయనతో నటించాల్సిందే, మీరే ఏదో ఒకటి చేయాలని చెప్పా. ఆయన మొదట ఎన్టీఆర్‌ని కలువు, తర్వాత చూద్దాం అన్నారు. నా కోరిక గురించి చెబితే... ‘ప్రసాద్‌కి సరిపడా వేషం ఏముందో, మీరే చూసి నిర్ణయించండి’ అని బాపుగారికి చెప్పారు. అప్పుడు సరిహద్దు రాజు పాత్రని నాకు ఇచ్చారు. అందులో నలుడిగానూ నేనే నటించా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట.’  
*‘ఎన్టీఆర్‌తో తొలి షాట్‌. ఎదురుగా ఆయన ఉన్నారు. ఇక్కడేమో నా కాళ్లు వణుకుతున్నాయి. నేను భయంగా ఉన్నా. ఆయనేమో అంత సౌకర్యంగా కనిపించడం లేదు. ఇండియాలో నంబర్‌ వన్‌ స్క్రీన్‌ప్లే రచయిత ఎవరంటే నేను ఎన్టీఆర్‌ పేరే చెబుతాను. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ‘బాపుగారూ, ప్రసాద్‌కి ఇప్పుడు నేనేమైనా సూచనలు ఇవ్వచ్చా?’ అని ఎంతో సంస్కారవంతంగా అడిగారు ఎన్టీఆర్‌. ‘అయ్యో... భలేవారే, చెప్పండి’ అని బాపుగారు అనేసరికి ఆయన నా వెనకగా వచ్చి వెన్నుపూస మీద ఫట్‌మని కొట్టారు. ‘మీరిప్పుడు ఈ దేశానికి రాజు, మేం రచయితలం. రాజేంద్రప్రసాద్‌లా కాకుండా, రాజులా నిలుచోవాలి’ అన్నారు. అప్పుడు కంగారుగా కాకుండా, నిఠారుగా నిలుచుని సన్నివేశం చేశా. ఆ సినిమాకి ఆయనే నిర్మాత. ‘మీకు ఈ బట్టలు మేమే కొన్నాం’ అని ఇచ్చేవారు. ఆ పాత్రను దృష్టిలో పెట్టుకుని, రాజస్థాన్‌లో ఎక్కడో దుస్తుల్ని కొనుక్కుని వచ్చారు. ఒకటేమిటి, ఆయనకి తెలియనిదంటూ లేదు. పౌరాణిక పాత్రలకు సంబంధించి కిరీటం మొదలుకొని మెడలో వేసుకునే నగల వరకు అన్నిటినీ ఆయనే డిజైన్‌ చేసుకునేవారు. ఎన్టీఆర్‌లో గొప్ప చిత్రకారుడూ ఉన్నారు’.


అభిమానిగా పుట్టినందుకు గర్వపడుతున్నా  
- దర్శక నిర్మాత వైవీఎస్‌ చౌదరి

‘ఇది ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం. తెలుగు వారందరికీ, ఎన్టీఆర్‌ను ప్రేమించే వాళ్లందరికీ ఈ ఏడాదంతా ప్రతిరోజూ ఓ పండగ రోజు కిందే లెక్క. ఆయన తన పుట్టుక ద్వారా విశ్వవిఖ్యాతమయ్యారు. తను పుట్టిన కుటుంబానికి, తల్లిదండ్రులకు, అలాగే తను అడుగిడిన ప్రతి రంగానికీ తన ద్వారా ఒక వన్నెను, ఖ్యాతిని అందించారు. ఎన్టీఆర్‌ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టడమన్నది తెలుగు తెర చేసుకున్న మహద్భాగ్యం. చారిత్రకం, పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా ఆయన పోషించిన పాత్రలు ఏవైనా కావొచ్చు. ఆయా పాత్రలన్నీ ఆయన నటనతో మురిసి, మెరిసి.. విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు అందుకున్నాయి. సామాజిక అంశాలను స్పృశిస్తూ, సందేశాన్ని మేళవిస్తూ.. నిర్మాతగానూ ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలు నిర్మించారాయన. దర్శకుడిగా ఆయన ప్రతిభ చూసి పెద్ద పెద్ద డైరెక్టర్లే ఆశ్చర్యపోయారు.    ప్రశంసలు కురిపించారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ ఒక వ్యక్తిలో ఉండటాన్ని భారతీయ చిత్ర ప్రముఖులంతా గుర్తించారు.    కీర్తించారు. తెలుగు భాష కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి.. తెలుగు నేలకు, జాతికీ ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. అలాంటి గొప్ప వ్యక్తికి అభిమానిగా పుట్టినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా.  దర్శకుడిగా చిత్రసీమ వైపు అడుగులు వేయడానికి నాకు స్ఫూర్తినిచ్చింది ఆయనే. తొలిసారి నాకు దర్శకత్వ అవకాశం వచ్చినప్పుడు వెళ్లి ఆయన్ని కలిసి.. విషయం చెప్పా. ‘మంచి కథ ఉంటే చెప్పండి.. నేను మీ దర్శకత్వంలో పని చేస్తాను’ అని ప్రోత్సహించారు. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలవి. నా దస్తూరిని ఆయన చాలా ఇష్టపడేవారు. ఏదైనా రాసిస్తే.. ‘ఇదిలాగే ఇవ్వండి.. దీన్ని టైప్‌ చేసి ఇవ్వాల్సిన పనిలేదు’ అనేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నేనెంతో ఉప్పొంగిపోయేవాడిని. ఆయన శతజయంతి సందర్భంగా మనం ఆయనకు చేయగలిగింది ఒక్కటే.. తెలుగులోనే మాట్లాడదాం. మన పిల్లల్ని తెలుగులోనే మాట్లాడించేలా శ్రద్ధ వహిద్దాం. ఇదే ఆయనకిచ్చే దివ్యమైన నివాళి’.


మంచి లక్షణాలు నేర్చుకున్నా  
- నటి జయసుధ

నా దృష్టిలో ఎన్టీఆర్‌ అంటే ఒక తిరుగులేని మనిషి. క్రమశిక్షణకు మారుపేరు. ఆయన అందరిలాగే ఓ మామూలు వ్యక్తే. కానీ, తాను అనుకున్న లక్ష్యాల్ని సాధించుకున్న తీరు, ఈ క్రమంలో ఆయన చేసిన అలుపెరుగని ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు నేను ఆయనతో కలిసి ‘నా దేశం’ చిత్రంలో నటించాను. ఆ సమయంలో ఆయన నాతో ఎన్నో విలువైన విషయాలు పంచుకునేవారు. ఆయన తెరపైనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే. సినిమాల్లో డైలాగ్‌లు చెప్పడమే కాదు.. నిజజీవితంలోనూ వాటిని ఆచరించి శభాష్‌ అనిపించుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు. ఎంత కష్టాన్నయినా ధైర్యంగా స్వీకరించేవారు. ఎన్టీఆర్‌ దర్శకులకు ఎంతో గౌరవమిచ్చేవారు. ఆయనెంత పెద్ద స్టార్‌ అయినా సెట్లోకి అడుగుపెట్టారంటే దర్శకుల మనిషిలాగే మెదిలేవారు. ఓ నటిగా నేను ఆయన నుంచి ఈ మంచి లక్షణాలన్నీ నేర్చుకున్నాను. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన బాపు దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’లో నటించారు. దాంట్లో నేనూ నటించా. ఓ షాట్‌లో నా డైలాగ్‌కు ఆయన కౌంటర్‌ చెప్పారు. మానిటర్‌లో ఆ సీన్‌ చూసుకున్నాక, బాపు దగ్గరకు వెళ్లి ‘జయసుధ తన డైలాగ్‌ చాలా బాగా చెప్పారు.. కానీ, నేనంత కరెక్ట్‌గా చెప్పినట్లు అనిపించట్లేదు. మీరు ఏమీ అనుకోకపోతే ఆ సీన్‌ రీషూట్‌ చేయగలరా’ అని అడిగారు. అలా ఏ పెద్ద హీరో అడుగుతారు చెప్పండి. నా నటనను మెచ్చుకుంటూ ఆ రోజు ఆయన అన్న ఆ మాట నాకు గొప్ప అవార్డులా అనిపించింది. ఈ రోజుకీ ఆయన ఉండి ఉంటే రాజకీయాల్లో ఇంకా ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి ఉండేవారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నో గొప్ప సంస్కరణలు చేపట్టి ఉండేవారు. కుమార్తెకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ప్రతిపాదించింది ఆయనే కదా.


మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండనిపిస్తోంది

 దర్శకుడు కె.రాఘవేంద్రరావు

‘‘నా కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్‌ నటించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘గుండమ్మ కథ’, ‘సీతారామకళ్యాణం’ చిత్రాలు చూసి.. ఇన్ని రకాల వేషాలు ఒక వ్యక్తి వేయడం చాలా గొప్ప విషయం అనుకునేవాణ్ని. నాకు తొలిసారి సహాయ దర్శకుడిగా ఆయనపైనే క్లాప్‌ కొట్టే అవకాశం కలిగింది.. ‘పాండవవనవాసం’లో భీముడి పాత్రపై. ‘అలా మొదలైన మా ప్రయాణం.. ‘అడవి రాముడు’తో పెద్ద హిట్‌ అందుకుంది. నా భవిష్యత్తుకు బాటలు వేసింది. ‘కొండవీటి సింహం’లో రంజిత్‌ కుమార్‌ పాత్రలో ఆయన నటన గుర్తొస్తే.. ఈ రోజుకీ ఒళ్లు గగుర్పొడుస్తుంది.  ఆయన ఆఖరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చేసే భాగ్యం కలిగింది.  ఇప్పుడీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. మళ్లీ ఆ రోజులు వస్తే బాగుంటుందనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్నెంతో ఆప్యాయంగా, సొంత   మనిషిలా చూసుకునేవారు.


గుండెల్లో చిరస్థాయి

 జయప్రద, ప్రముఖ నటి

‘‘ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా నటులకి కార్‌ వ్యాన్లు ఉండేవి కావు. దుస్తులు మార్చుకోవాలంటే దగ్గర్లో ఉన్న  ఎవరిళ్లకైనా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు ఏ ఇంటికెళ్లినా ఎన్టీఆర్‌ క్యాలెండర్లే కనిపించేవి.  ఎన్టీఆర్‌ని ఒక దేవుడిగా చూసేవారు. అలాంటి కారణజన్ముడితో కలిసి నేను పలు అంశాల్లో ప్రయాణం చేయడం సంతోషాన్నిస్తుంది. దేవుడు కనిపించకపోయినా కృష్ణుడిగా, రాముడిగా, వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్‌ రూపంలోనే చూస్తుంటాం. పేద ప్రజలు తన వాళ్లే అనుకున్న రాజకీయ నేత. రాజకీయంలోకి వచ్చాక పేద ప్రజలకోసమే రూ: 2కి కిలోబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్‌కి గొప్ప అభిమానినైన నేను చూస్తూ చూస్తూ ఒక రోజు ఆయన ‘అడవి రాముడు’ సినిమాకి హీరోయిన్‌ని అయ్యాను. దర్శకులు ఎన్ని గంటలకి చెబితే అన్ని గంటలకి సెట్లో ఉండేవారు. నటనపరంగానే కాదు, రాజకీయంగానూ ఆయనే నాకు స్ఫూర్తి. ’

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని