Prithviraj Sukumaran: నాకు తెలిసినవి ఆ రెండే

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌... పరిచయం అవసరం లేని కథానాయకుడు. మలయాళం స్టార్‌గా దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించారు. ఆయనలో నటుడే కాదు... మంచి దర్శకుడు, నిర్మాత, గాయకుడూ ఉన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘కడువా’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

Updated : 26 Jun 2022 07:02 IST

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran)... పరిచయం అవసరం లేని కథానాయకుడు. మలయాళం స్టార్‌గా దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించారు. ఆయనలో నటుడే కాదు... మంచి దర్శకుడు, నిర్మాత, గాయకుడూ ఉన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘కడువా’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

మలయాళంలో కడువా(Kaduva) అంటే పులి అని అర్థం. సినిమాలో కథానాయకుడి పేరు కడువాకున్నేల్‌ కురువచన్‌. అందరూ కడువా అనే పిలుస్తుంటారు.

* ఓటీటీ వేదికల ప్రభావంతో రీమేక్‌ సినిమాలు క్రమంగా తగ్గుతాయి. పరిశ్రమలన్నీ బహుభాషా చిత్రాలపై దృష్టి పెడతాయి. భవిష్యత్తులో అధిక వ్యయంతో రూపొందే సినిమాలన్నీ ఇదే తరహాలోనే విడుదలవుతాయి. ‘బాహుబలి’(Baahubali) సినిమాలతో రాజమౌళి ఈ మోడల్‌ని పరిచయం చేశారు.  

* వాస్తవికత, తెలివైన కథలకి పెట్టింది పేరు మలయాళం సినిమా. ఈ పరిశ్రమ అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఈ కథలే. ఆ విషయంలో గర్వపడతాను. అయితే 2019లో ‘కడువా’ కథ విన్నప్పుడు ‘మేం ఉన్నట్టుండి ఇలాంటి సినిమాల్ని తీయడం ఆపేశాం ఎందుకు?’ అనిపించింది. రిశ్రమలో అన్ని రకాల కథలు తెరపైకొస్తుండాలి. మలయాళం సినిమా అంటే వాస్తవికతతో కూడిన సినిమాలేనా? సామాజికాంశాలతో కూడిన సినిమాలేనా? ఇలాంటి మాస్‌, యాక్షన్‌ వినోదంతో కూడిన వాటిని చాలా రోజులుగా మిస్‌ అవుతున్నాం కాబట్టి ఇది చేయాల్సిందే అనుకున్నా.

* నాకు తెలిసి రెండే రకాల సినిమాలున్నాయి. ఒకటి మంచిది, మరొకటి చెడ్డ సినిమా. సమాంతరమైనా, వాణిజ్యాంశాలతో కూడిన సినిమానైనా... ప్రేక్షకుణ్ని ఎలా రంజింపజేసిందనేదే కీలకం.  

రానా(Rana) నా కోసం ప్రత్యేకంగా ‘భీమ్లానాయక్‌’(Bheemla Nayak) స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశాడు. ఓ సినిమా చిత్రీకరణ కోసం మూడు నెలలపాటు జోర్డాన్‌, అల్జీరియాలో గడపాల్సి వచ్చింది. దాంతో చూడలేకపోయా. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’, ‘కడువా’... ఇలా మగాళ్లలో అహం గురించి చెప్పే ఈ మూడు సినిమాల్ని విజయవంతంగా పూర్తి చేశాను. ఈ కథకీ అహమే ఆధారం. అయితే వాణిజ్యాంశాలతో కూడిన కథ.  

* నేను చాలా పనులు చేసేస్తున్నానని నాకెప్పుడూ అనిపించదు. కొన్ని సినిమాలకి నేను దర్శకత్వం వహిస్తుంటా, కొన్నిసార్లు నిర్మిస్తుంటా. కొన్ని సినిమాల్లో నటుడినే. అయితే నేను వాటికీ రచన, లొకేషన్ల వేట మొదలుకొని ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటికంటే నిర్మాణం అప్పుడప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.  

* చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’(God Father) సినిమాకి దర్శకత్వం నన్నే చేయమన్నారు. కుదరలేదు. కచ్చితంగా ఆ సినిమా మాతృకకంటే పెద్ద చిత్రం అవుతుంది. ‘లూసిఫర్‌2’ని తెరకెక్కిస్తున్నా. అవకాశం వస్తే దాన్ని తెలుగులో చిరంజీవితో నేనే తీస్తా.

* ఈ రోజే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో(Prasanth Neel) సమావేశం కానున్నా. డేట్స్‌ సర్దుబాటు అయితే ‘సలార్‌’లో(SALAAR) తప్పకుండా నటిస్తా.  తెలుగులో తొలిసారి, అదీ ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశాన్ని వదులుకోకూడదనేది నా అభిప్రాయం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు