Happy Birthday: మనసు పెట్టి చేస్తే.. ప్రేక్షకులు వదులుకోరు

‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి.. కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అందుకే అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ ‘హ్యాపీ బర్త్‌డే’ విషయంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి

Updated : 30 Jun 2022 11:15 IST

‘‘ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి.. కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అందుకే అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ ‘హ్యాపీ బర్త్‌డే’(Happy Birthday) విషయంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి (Rajamouli). లావణ్య త్రిపాఠి(Lavanya Triparti) ప్రధాన పాత్రలో రితేష్‌ రానా(Ritesh rana) తెరకెక్కించిన చిత్రమిది. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంచి ప్రాజెక్ట్స్‌ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సినిమా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. రితేష్‌కు తన సినిమాలపై నమ్మకం ఎక్కువ. ట్రైలర్‌లో పాన్‌ తెలుగు సినిమా అని చూడగానే నవ్వొచ్చింది. లావణ్య పాత్ర బాగుంది. చాలా బాగా నటించింది. కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు నాయికలకు దొరకడం అరుదు. కామెడీ, థ్రిల్లర్‌ కలిపి చేయడం చాలా కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొకటి తగ్గిపోతుంది. రితేష్‌ వాటిని బాగా బ్యాలెన్స్‌ చేసుంటాడని తెలుస్తోంది’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా కంటే డబుల్‌ ఫన్‌, యాక్షన్‌, థ్రిల్‌ ఇందులో ఉన్నాయి’’ అన్నారు చిత్ర దర్శకుడు రితేష్‌. నటి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన చిత్రం. దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది. నా క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుంది’’ అంది. ‘‘ఇదొక సర్రియల్‌ యాక్షన్‌ కామెడీ చిత్రం. ‘జాతిరత్నాలు’ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్‌ చేశారో.. మా చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు’’ అన్నారు నిర్మాతలు వై.రవిశంకర్‌, చెర్రి. ఈ కార్యక్రమంలో సురేష్‌ సారంగం, రవితేజ తదితరులు పాల్గొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని