సమాజం మెచ్చే ‘అల్లూరి’

‘‘నేటి సమాజానికి కావాల్సిన సినిమా ‘అల్లూరి’. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని ఫిక్షనల్‌ బయోపిక్‌గా రూపొందించాం’’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘అల్లూరి’. నిజాయతీకి మారుపేరు.. అన్నది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు.

Published : 05 Jul 2022 01:52 IST

‘‘నేటి సమాజానికి కావాల్సిన సినిమా ‘అల్లూరి’. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని ఫిక్షనల్‌ బయోపిక్‌గా రూపొందించాం’’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘అల్లూరి’. నిజాయతీకి మారుపేరు.. అన్నది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. కయదు లోహర్‌ కథానాయిక. సోమవారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ విడుదల చేశారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘అల్లూరి జయంతి   సందర్భంగా మా చిత్ర ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. సైనికులు, పోలీసులు, వైద్యులు.. ఈ ముగ్గురిని రియల్‌ హీరోలుగా చూస్తా. ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు చాలా నిజాయతీ ఉండి, నచ్చితేనే చేయాలని అనుకునేవాడిని. సరిగ్గా ఇదే సమయంలో నిజాయతీ గల పోలీస్‌ పాత్ర దొరికింది. ఇది చూశాక నేనెందుకు పోలీస్‌ అవ్వలేదని అనుకున్నా. నా కెరీర్‌ బెక్కెం వేణుగోపాల్‌తోనే మొదలైంది. ఆయనతోనే రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెడుతున్నా. ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. ‘‘నిజాయితీ గల ఒక పోలీస్‌ అధికారి తన 16ఏళ్ల వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఏం చేశారనేది ఇందులో చూపించనున్నాం. సినిమా చూసి బయటకొచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా పోలీసులకు సెల్యూట్‌ చేస్తారు’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘అన్ని రకాల వాణిజ్య హంగులు ఉన్న గొప్ప సినిమా ఇది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ, హీరో తేజ సజ్జా, ప్రసన్నకుమార్‌, రాజ్‌ తోట తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని