ఆ ప్రశ్న పదేళ్లుగా వింటూనే ఉన్నా!

‘క్రికెట్‌ని మతంలా భావించే దేశంలో మహిళ క్రికెట్‌ని సైతం ఆదరించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు తాప్సి పన్ను. తను టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘శభాష్‌ మిథూ’. దిగ్గజ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందీ చిత్రం.

Published : 05 Jul 2022 06:02 IST

‘క్రికెట్‌ని మతంలా భావించే దేశంలో మహిళ క్రికెట్‌ని సైతం ఆదరించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు తాప్సి పన్ను. తను టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘శభాష్‌ మిథూ’. దిగ్గజ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందీ చిత్రం. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. విజయ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. జులై 15న విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా తాప్సి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెప్పిన విశేషాలు తన మాటల్లోనే...
* మనదేశంలో క్రికెట్‌, సినిమా.. రెండే మతాలు. భారత్‌ క్రికెట్‌ని శ్వాసించే దేశంగా చూడాలనుకుంటే పురుషుల క్రికెట్‌తోపాటు, మహిళా క్రికెట్‌ను సమానంగా ప్రేమించాల్సిందే. ఇక్కడ ఆటే ప్రధానం తప్ప జెండర్‌ కాదు. ఇది సినిమాలకీ వర్తిస్తుంది. అభిమాన హీరో సినిమాకి ముందే టికెట్లు బుక్‌ చేసుకొని, కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రానికి రివ్యూల కోసం ఎదురుచూడటం సమంజసం కాదు.
* ‘మీకు ఇష్టమైన నటుడు ఎవరు? ఎవరికి జోడీగా నటించాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలు పదేళ్లుగా వింటూనే ఉన్నా. ఇదే ప్రశ్న కథానాయకులను ఎవరైనా అడగటం అరుదు. సినిమా హీరో ప్రాధాన్యమా? హీరోయినా? అన్నది నేను చూడను. నా పాత్ర బాగా రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా.
రశ్మీ రాకెట్‌’ ఒప్పుకోవడానికి ముందువరకూ నాకు ఆటల గురించి పెద్దగా తెలియదు. ఒక్కసారి ఆ సినిమాని ఒప్పుకున్నాక పాత్రని అర్థం చేసుకోవడం కోసం ఆ గేమ్స్‌ గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టా. శభాష్‌ మిథూ కోసం నలుగురు కోచ్‌ల దగ్గర ఆరునెలలపాటు క్రికెట్‌ సాధన చేశా. మిథాలీలాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారే తలుపు తడతాయి. దానికి వందశాతం న్యాయం చేయాలన్నదే నా తపన.
షూటింగ్‌ సమయంలో నేనెప్పుడూ మిథాలీని వ్యక్తిగతంగా కలవలేదు. అప్పుడు తను ఆటలో బిజీగా ఉంది. తర్వాత చాలాసార్లు కలిశా. సంతోషం, బాధ... దేనికీ పెద్దగా స్పందించదు. నేను పూర్తి విరుద్ధం. అయినా రెండు గంటల్లో ఆమె ముప్ఫై ఏళ్ల జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశాం.
* నేను నటిని, నటించడం వరకే నా బాధ్యత అని ఎప్పుడూ ఫీలవను. ప్రేక్షకుల అభిప్రాయం, స్పందనని గౌరవిస్తా. వాళ్లకు నచ్చేలా నటించడానికి ప్రయత్నిస్తా. నా సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి కలెక్షన్లు రావాలని ఎప్పుడూ ఆశిస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని