Published : 05 Jul 2022 05:09 IST

ఇంకేం కావాలి!

పవన్‌ కల్యాణ్‌ బయ్యాను, జాన్వీ శర్మ జంటగా నరసింహారాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంతేనా.. ఇంకేం కావాలి’. రవీంద్రబాబు నిర్మాత. సునీల్‌, బ్రహ్మాజీ, సుమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీమోహన్‌ క్లాప్‌ కొట్టగా.. దగ్గుబాటి అభిరామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఘర్షణ శ్రీనివాస్‌ స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. అమ్మకు ఇచ్చిన మాటను, అమ్మాయికి ఇచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చాడు? అన్నది కథాంశం. తల్లీకొడుకుల సెంటిమెంట్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెల నుంచి రెగ్యలర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కామెడీ, లవ్‌, సెంటిమెంట్‌.. ఇలా అన్నీ ఉన్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత. హీరో పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి కథలో నటించే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు. కరాటే కల్యాణి, జాన్వీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


హృదయానికి హత్తుకునేలా..

రఘు కుంచే ప్రధాన పాత్రలో పి.సునీల్‌కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. అజయ్‌,  కృష్ణ, సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌, రేఖ నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇది. నేను నా తండ్రికి ఇచ్చే సెల్యూట్‌, నా కొడుకుకి ఇచ్చే కానుక.. ఈ చిత్రం. చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ల నాన్నకు ఫోన్‌ చేసి ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతారు. అలాగే ప్రతి తండ్రీ తన కొడుకును దగ్గర తీసుకుంటాడు’’ అన్నారు. ‘‘నాకు బాగా నచ్చి.. నిర్మించిన చిత్రమిది. గతంలో ‘మాతృదేవోభవ’ సినిమా చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో.. ఈ చిత్రం చూశాకా అంతే అనుభూతికి లోనయ్యా. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, అజయ్‌, కాశీ విశ్వనాథ్‌, ప్రసన్న కుమార్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts