Updated : 06 Aug 2022 02:23 IST

Tollywood: తెలుగు తెరకు ‘కొత్తందం’

చిత్రసీమలో కొత్తదనం కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. కథ... కథనం... తారాగణం...  సాంకేతికత... ఇలా అన్నిచోట్లా   వైవిధ్యమే కావాలి. ప్రేక్షకుల అభిరుచులు... అటువైపు నుంచి వస్తున్న డిమాండే అందుకు కారణం. ‘కొత్తగా ఉంటుంద’ని ఏ విషయంలో అనిపించినా సరే, ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతుంటాయి సినీ వర్గాలు. ఆ కొత్తదనం తెరపైనా కనిపించినప్పుడే తగిన ఫలితాలొస్తుంటాయి. కథ, కథనాల విషయంలో సంగతేమో కానీ... కొత్త తారాగణాన్ని తెరపైకి తీసుకు రావడంలో జోరు చూపిస్తుంటుంది మన చిత్రసీమ. ముఖ్యంగా కథానాయికల్ని! అటు బాలీవుడ్‌ మొదలుకొని... ఇటు మలయాళం వరకు ఎక్కడ కొత్తందం మెరిసినా సరే, వెంటనే వాలిపోయి అవకాశాలతో ఆహ్వానం పలుకుతుంటారు మన దర్శకనిర్మాతలు.  అందుకే ఏటా పదుల సంఖ్యలో కొత్త కథానాయికలు మన తెరపై మెరుస్తున్నారు.

కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న బాలీవుడ్‌ భామల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాన్‌ ఇండియా చిత్రాల జోరు పెరగడమే అందుకు కారణం. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం అన్ని భాషల్లోనూ   గుర్తింపున్న తారల్ని ఎంపిక చేసుకోవాలనే వ్యూహంతో ఉంటాయి ఆయా చిత్రబృందాలు. ఆ క్రమంలో ఎక్కువగా హిందీ భామలకే అవకాశాలు దక్కుతుంటాయి. దీపికా పదుకొనె మొదలుకొని, కియారా అడ్వాణీ, అనన్యపాండే వరకు పలువురు భామలు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నెలలోనే విడుదలవుతున్న ‘లైగర్‌’తో అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో సందడి చేసిన అలియాభట్‌ ఆ వెంటనే ఎన్టీఆర్‌ సినిమాలో నటించేందుకూ అంగీకారం తెలిపింది. అలియాభట్‌ పెళ్లి తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకొంది. ‘సీతారామం’తో మృణాల్‌ ఠాకూర్‌ సందడి చేసింది. ‘మేజర్‌’, ‘గని’ సినిమాలో సయీ మంజ్రేకర్‌ తెలుగు తెరకు కొత్తందాన్ని అద్దేసింది.

చుట్టుపక్కల నుంచీ
దక్షిణాదికి చెందిన కథానాయికలు తెలుగులో ఈసారి ఎక్కువగా పరిచయమయ్యారు. ‘భీమ్లానాయక్‌’, ‘బింబిసార’ సినిమాలతో సంయుక్త మేనన్‌ సందడి చేసింది. మరిన్ని సినిమాల విషయంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఇదివరకే సుపరిచితమైనా, ఈసారే నేరుగా తెలుగు చిత్రం చేసింది మలయాళ భామ నజ్రియా. ఆమె నానితో కలిసి ‘అంటే సుందరానికి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో రజీషా విజయన్‌ తెలుగుకు పరిచయమైంది. ‘గాడ్సే’తో ఐశ్వర్య లక్ష్మి, ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’తో రితిక నాయక్‌ ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.

ఆ స్థానాలు భర్తీ చేయాలని...
* కథానాయికలు ఎంత మంది వచ్చినా మరొకరికి చోటు ఉంటుంది తెలుగులో. ఈ ఏడాది కొత్త భామల పరంపర కొనసాగుతూనే ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏజెంట్‌’తో సాక్షి వైద్య పరిచయం అవుతోంది. నాగశౌర్య సినిమా ‘కృష్ణ వృంద విహారి’ సినిమాతో షెర్లీ సేటియా తెలుగు తెరపైకొస్తోంది. కొన్నేళ్లుగా తెలుగులో స్టార్‌ భామలుగా కొనసాగుతున్న చాలామంది ఇప్పుడు హిందీ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ముంబయి కేంద్రంగా పనిచేస్తూ బిజీ బిజీగా కొనసాగుతున్నారు. వాళ్లంతా తెలుగులోనూ నటిస్తున్నప్పటికీ... ఆ స్థానాలు ఖాళీ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. కొత్తందాలు ఏమాత్రం హిట్‌ అయినా స్టార్‌ హోదాని సొంతం చేసుకుని కెరీర్‌లో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని