Krithi Shetty: అమ్మను మించిన బెస్ట్‌ ఫ్రెండ్‌ లేరు

‘‘పాత్ర నిడివిని నేనెప్పుడూ దృష్టిలో పెట్టుకోను. స్క్రీన్‌ టైమ్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బహుముఖ నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా’’ అంది కృతి శెట్టి. ఇటీవలే ‘ది వారియర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ అమ్మడు..

Updated : 07 Aug 2022 06:54 IST

‘‘పాత్ర నిడివిని నేనెప్పుడూ దృష్టిలో పెట్టుకోను. స్క్రీన్‌ టైమ్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బహుముఖ నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా’’ అంది కృతి శెట్టి. ఇటీవలే ‘ది వారియర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’తో అలరించేందుకు సిద్ధమైంది. నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఎం.ఎస్‌.   రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించారు. కేథరిన్‌ మరో నాయిక. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే   శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతి.

వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. కెరీర్‌కు ఉపయోగపడే చిత్రాలు చేస్తున్నానా.. లేదా? అని అప్పుడప్పుడు సమీక్షించుకుంటున్నారా?

‘‘వరుస చిత్రాలు  చేయడాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేస్తున్నా. నాలోని ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నందుకు దర్శక నిర్మాతలకు    కృతజ్ఞతలు. నేను వచ్చి ఏడాదే పూర్తయింది. రాంగ్‌ ఛాయిస్‌ ఉంటుందని అనుకోను. నేను చేసే ప్రతి సినిమా నుంచి ఏదోక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటా. అందుకే చిత్ర ఫలితంపై నాకెలాంటి రిగ్రెట్‌ ఉండదు’’.

ఈ మాచర్ల కథేంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘రాజకీయాలతో ముడిపడిన ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. కామెడీ, యాక్షన్‌, పాటలు.. ఇలా అన్ని రకాల అంశాలతో మంచి ప్యాకేజీలా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్‌గా కనిపించే అమాయకురాలైన అమ్మాయి తను. అయితే ఈ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో షేడ్‌ బయటకొస్తుంటుంది. సగటు కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్‌కు ఎక్కవ స్క్రీన్‌ టైమ్‌ ఉండదు. ‘మాచర్ల..’ అలా కాదు. ఈ కథలో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఎంతగానో ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు.. ఈ చిత్రాన్ని చక్కగా ఎంజాయ్‌ చేస్తారు’’.


‘‘నాకు చిన్నప్పటి నుంచి ఎన్జీవో ప్రారంభించాలని ఉండేది. త్వరలో మొదలుపెడతానని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను తెలుగులో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నా. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటించా. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. అలాగే తమిళంలో బాలా దర్శకత్వంలో సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నా. ఇప్పటికే 30శాతం చిత్రీకరణ పూర్తయింది’’.


ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోనున్నారు?  

‘‘ముంబయిలో ఉండుంటే నా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి బాగా హడావిడి చేసేదాన్ని. ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కట్టుకోవడం.. గ్రీటింగ్స్‌ ఇచ్చి పుచ్చుకోవడం.. కేక్‌ కటింగ్స్‌ బోలెడంత సందడి ఉండేది. ‘మాచర్ల..’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కదా.. ఈసారి కుదర్లేదు’’.

మీకున్న ఓ మంచి ఫ్రెండ్‌ ఎవరు? మీ కెరీర్‌ ఎదుగుదలలో వారి పాత్ర ఎంత?

‘‘మా అమ్మే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తనని మించిన బెస్ట్‌ ఫ్రెండ్‌ మరొకరు లేరు. చిన్నప్పటి నుంచి తనే నాకు పెద్ద స్ఫూర్తి. నా జీవితంలో నేను చూసిన అత్యంత కష్టపడి పనిచేసే వ్యక్తి ఆమే. నా ప్రతి నిర్ణయం వెనుక ఆమె సలహా కచ్చితంగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీ విషయానికొస్తే.. నేను పనిచేసిన ప్రతి హీరోతోనూ నాకు మంచి స్నేహ బంధం ఉంది. అలాగే నాయికల్లో ప్రియాంక మోహన్‌, కీర్తి సురేష్‌లతో పరిచయం ఉంది. అప్పుడప్పుడు ఫోన్లలో చాట్‌ చేసుకుంటుంటాం’’.

ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

‘‘మాచర్ల..’ సెట్‌కు వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంతో నితిన్‌ నాకు మంచి స్నేహితులయ్యారు. ఇందులో వెన్నెల కిషోర్‌, రాజేంద్రప్రసాద్‌, ఇంద్రజ.. ఇలా చాలా మంది నటీనటులున్నారు. వాళ్లందరి కంటే నేనే చిన్నదాన్ని. అందుకే సెట్లో    నన్నందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇక దర్శకుడు రాజశేఖర్‌ చాలా కూల్‌ పర్సన్‌. ఆయన ముఖంలో ఎప్పుడూ కోపం, చిరాకు చూడలేదు. ప్రతి సీన్‌ను చాలా క్లియర్‌గా చెప్తారు. ఆయన వర్క్‌ చూస్తే.. ఫస్ట్‌ టైమ్‌ దర్శకుడిలా అనిపించరు’’.

‘ఉప్పెన’ సినిమా నటిగా మీకొక ప్రత్యేకమైన ఇమేజ్‌ అందించింది. అదెప్పుడైనా భారంగా అనిపిస్తుందా? ఈ మధ్య మళ్లీ అలాంటి పాత్ర చేయలేదన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా?

‘‘ఉప్పెన’లో నా పాత్ర ప్రేక్షకులకు నచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా పాత్రను వాళ్లెంతో ప్రేమించారు. అయితే అన్నీ అలాంటి పాత్రలే చేయాలని లేదు కదా. నటిగా వైవిధ్యం చూపించాలి. అందుకే ‘ఉప్పెన’ తర్వాత వెంటనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో పూర్తి భిన్నమైన పాత్ర పోషించా. ప్రస్తుతం నా నుంచి రానున్న మిగతా చిత్రాలు వేటికవే  విభిన్నంగా ఉంటాయి’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని