అదే కొత్త సవాల్‌

‘‘సీతారామం’ కోసం చిత్ర బృందమంతా రెండేళ్ల పాటు చాలా కష్టపడింది. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు క్లాసిక్‌ బ్లాక్‌బస్టర్‌ రూపంలో ఇచ్చారు. ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అంది నటి రష్మిక. ఆమె ‘సీతారామం’లో అఫ్రిన్‌గా సందడి చేసిన

Published : 09 Aug 2022 03:44 IST

‘‘సీతారామం’ కోసం చిత్ర బృందమంతా రెండేళ్ల పాటు చాలా కష్టపడింది. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు క్లాసిక్‌ బ్లాక్‌బస్టర్‌ రూపంలో ఇచ్చారు. ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అంది నటి రష్మిక. ఆమె ‘సీతారామం’లో అఫ్రిన్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి తెరకెక్కించారు. అశ్వినీ దత్‌ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం విలేకర్లతో ముచ్చటించారు రష్మిక.


నా కంఫర్ట్‌ జోన్‌ దాటి చేస్తున్నా..

‘‘ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తూ.. ఓ ఇమేజ్‌ ఛట్రంలో ఉండిపోవాలనుకోవట్లేదు. కంఫర్ట్‌ జోన్‌లో ఉండటం పైకి బాగానే ఉంటుంది కానీ, నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి. అందుకే ప్రయోగాత్మక చిత్రాలు చేయడం చాలా ముఖ్యం. నాకు అన్ని రకాల వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని ఉంది. ఇందుకోసమే ప్రస్తుతం నా కంఫర్ట్‌ జోన్‌ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా. ఓ చిత్రంలో     డాక్టర్‌గా.. ఇంకో సినిమాలో భార్యగా.. ఇలా భిన్నమైన పాత్రలతో ప్రయాణం చేస్తున్నా’’.


అఫ్రిన్‌.. ఓ సవాల్‌

‘‘ఇది నా కెరీర్‌లోనే ఎంతో విభిన్నమైన సినిమా. నేనిప్పటి వరకు కథానాయికగానే చేశాను. అఫ్రిన్‌ లాంటి భిన్నమైన.. వైలెంట్‌ పాత్రను ఇంత వరకు చేయలేదు (నవ్వుతూ). ఇదే నాకు ఓ కొత్త సవాల్‌లా అనిపించింది. ఒక గొప్ప కథను చెప్పే పాత్ర కావడం వల్ల అఫ్రిన్‌ నాకు చాలా నచ్చింది. హను ఈ పాత్ర గురించి చెప్పినప్పుడే దీంట్లో గ్రేట్‌ ఆర్క్‌ ఉందని అన్నారు. నేనూ దాన్ని బలంగా నమ్మాను. ఈరోజున మా నమ్మకం నిజమైంది. హను గొప్ప ప్యాషన్‌ ఉన్న దర్శకుడు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడతారు. తను పడ్డ కష్టానికి మంచి ఫలితం దక్కింది. ఆయనకు ఇలాంటి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నా’’.


ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు..

‘‘నేను అదృష్టాన్ని.. హార్డ్‌ వర్క్‌ని.. రెండింటినీ నమ్ముతా. నా జీవితంలో ఈ రెండూ సమంగా ఉన్నాయి. కెరీర్‌ తొలినాళ్ల నుంచి సినిమాల విషయంలో నేనెప్పుడూ ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. కన్నడలో తొలి సినిమా చేస్తున్నప్పుడే తెలుగు నుంచి ‘ఛలో’ అవకాశమొచ్చింది. అది చేస్తుండగానే ‘గీత గోవిందం’, ‘దేవదాస్‌’ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు హిందీలోనూ ఇంకా ఒక్క చిత్రం విడుదల కాక ముందే వరుస అవకాశాలు అందుకుంటున్నా. సరైన కథలు వస్తున్నప్పుడు ఇలా వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఈ విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటా’’.


‘‘నేను ఇప్పుడిప్పుడే ప్రయోగాలు చేస్తున్నా. ఇంకా చాలా చేయాల్సి ఉంది. మంచి పీరియాడికల్‌ సినిమా చేయాలనుంది. అలాగే స్పోర్ట్స్‌, యాక్షన్‌, బయోపిక్‌.. ఇలా బోలెడన్ని డిఫరెంట్‌ చిత్రాలు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలు పూర్తి చేశా. విజయ్‌తో ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్నా. త్వరలో ‘పుష్ప2’ చిత్రీకరణ మొదలవుతుంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని