Bimbisara: ‘బింబిసార’ నాకు పునర్జన్మ

‘‘ఒక సినిమాకు దర్శకుడు.. నిర్మాత.. హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురూ తలచుకుంటే అటు బడ్జెట్లు కానీ.. ఇటు సక్సెస్‌లు గానీ ఏదైనా సాధించవచ్చు’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బింబిసార’

Published : 09 Aug 2022 03:44 IST

కల్యాణ్‌రామ్‌

‘‘ఒక సినిమాకు దర్శకుడు.. నిర్మాత.. హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురూ తలచుకుంటే అటు బడ్జెట్లు కానీ.. ఇటు సక్సెస్‌లు గానీ ఏదైనా సాధించవచ్చు’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బింబిసార’ చిత్ర సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వశిష్ఠ్‌ తెరకెక్కించారు. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సక్సెస్‌ మీట్‌లో హీరో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ప్రారంభించినప్పటి నుంచీ కొవిడ్‌ వల్ల రకరకాల ఇబ్బందులెదుర్కొన్నాం. దాంతో నేను కాస్త టెన్షన్‌ పడ్డా. ఎందుకంటే ఇది నాకు కొత్త జానర్‌. గ్రాఫిక్స్‌ విజువల్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న పెద్ద చిత్రం. ఏమైపోతుందో అనిపించేది. కానీ, నాకొక నమ్మకం ఉండేది. మంచి కంటెంట్‌ తీసి ప్రేక్షకుల ముందు పెడితే.. వాళ్లే బ్రహ్మరథం పడతారని నమ్మాను. ఈరోజున అది నిజమైంది. నాకు పునర్జన్మనిచ్చిన చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అన్నారు. ‘‘ఆగస్టు 1నుంచి చిత్రీకరణలు నిలిపివేసి చిత్రసీమ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తున్నాం. జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఆగస్టు 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. ఇండస్ట్రీ కష్ట కాలంలో ఉన్న సమయంలో దర్శకుడు వశిష్ఠ ఇండస్ట్రీకి హిట్‌ ఇచ్చాడు. ఓ చిత్రాన్ని ఎలా చెయ్యొచ్చన్నది నిర్మాత హరికృష్ణ మాకు చూపించారు. ఈ చిత్రాన్ని నేను విడుదలకు ముందే చూశాను. కల్యాణ్‌రామ్‌ అద్భుతంగా చేశారు.. కచ్చితంగా హిట్‌ కొడతారని అప్పుడే అనిపించింది. ఇప్పుడదే నిజమైంది. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీదేవి, ఛోటా కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని