Published : 11 Aug 2022 02:20 IST

నిజ జీవితంలోనూ రాజప్పని చూశా

‘‘నటుడిగా వందశాతం తృప్తినిచ్చే పాత్రలు అరుదు. అలాంటి అరుదైన... నటనకి ప్రాధాన్యమున్న రాజప్ప పాత్రని పోషించడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు ప్రముఖ నటుడు సముద్రఖని. దర్శకుడిగా తెలుగు పరిశ్రమకి పరిచయమైన ఆయన... కొన్నేళ్లుగా ప్రతినాయక పాత్రలకి కేరాఫ్‌గా మారారు. ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’లో రాజప్ప పాత్రని పోషించారు. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో  మాట్లాడారు.

‘‘త్రివిక్రమ్‌, రాజమౌళి, గోపీచంద్‌ మలినేని, పరశురాం... వంటి దర్శకులతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. మంచి చిత్రాలు చేసే అదృష్టం దొరికింది. గతేడాది దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ కథని వినిపించారు. చాలా నచ్చింది. తమిళనాడులోనూ ఓ చోట ఇరవయ్యేళ్లుగా ఎన్నికలు జరగలేదు. ఒక ఐఏఎస్‌ అధికారి వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దారు. ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడికి ఇదే విషయాన్ని చెప్పా. నేను పోషించిన రాజప్ప తరహా పాత్రల్ని నా నిజ జీవితంలోనూ చూశా. ఆ  పాత్రలో ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి. చాలా కష్టపడి చేసిన ఈ పాత్రని తెరపై చూసుకునేసరికి ఆ కష్టాన్నంతా మరిచిపోయా’’. 

* ‘నితిన్‌ ఎంత ఉత్సాహంగా ఉంటారో, అంత పాజిటివ్‌గా ఉంటారు. ఆయన కళ్లల్లో చూసి కోపంగా డైలాగ్‌ చెప్పలేకపోయేవాణ్ని. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం మంచి అనుభవం. వాణిజ్యాంశాలతోపాటు, ఒక మంచి కథ ఉన్న ఈ సినిమాలో ప్రేమకథ, కామెడీ, పోరాటాలు అన్నీ అలరిస్తాయి. నితిన్‌ హీరోగా, నేను దర్శకుడిగా త్వరలోనే ఓ సినిమా చేస్తాం. దాని గురించి మా ఇద్దరి మధ్య రెండేళ్ల కిందటే చర్చలు జరిగాయి. స్వతహాగా ఎడిటర్‌ అయిన దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి ఎంతో స్పష్టతతో ఈ సినిమాని తీశాడు’’.
* ‘‘నాలోనూ దర్శకుడు ఉన్నా... నటిస్తున్నప్పుడు తను బయటికి రాడు. రచన అంటే నాకు ప్రాణం. చిత్రీకరణ విరామంలోనూ ఏదైనా ఆలోచన వస్తే దాన్ని పేపర్‌పై పెడుతుంటా. పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ సిద్ధమైతే దాన్ని భద్రంగా లాకర్‌లో పెట్టినట్టుగా దాచుకుంటూ ఉంటా. అవసరమైనప్పుడు వాటిని బయటికి తీస్తా. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, నాని ‘దసరా’ చిత్రాల్లో నటిస్తున్నా’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని