‘కార్తికేయ’ను మించేలా ఉంటుంది!

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న కథానాయకుడు నిఖిల్‌. ఆయన నటించిన ‘స్వామి రారా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కార్తికేయ’, ‘అర్జున్‌ సురవరం’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Published : 12 Aug 2022 01:41 IST

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న కథానాయకుడు నిఖిల్‌. ఆయన నటించిన ‘స్వామి రారా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కార్తికేయ’, ‘అర్జున్‌ సురవరం’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడాయన ‘కార్తికేయ 2’తో మరోసారి థ్రిల్‌ పంచేందుకు సిద్ధమయ్యారు. చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా రూపొందింది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ
నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ ముచ్చట్లు..

* పురాణాలకు.. చరిత్రకు ముడిపెడుతూ సాగే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీంట్లో ప్రతి దృశ్యానికి ఒక అర్థం ఉంటుంది. మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతుందీ సినిమా. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే ఇద్దరికీ ఈ చిత్రం నచ్చుతుంది. అసలు దేవుడు అంటే ఏంటి? అనేది ఇందులో చూపించాం. ‘కార్తికేయ’ చిత్రం చేసే సమయంలోనే ఈ సీక్వెల్‌ గురించి చందును అడిగా. ఈసారి మనం చేసే కథ తొలి భాగాన్ని మించేలా ఉండాలని చెప్పా. తర్వాత 2016లో నాకు ఈ కథ చెప్పాడు. వినగానే బాగా నచ్చి.. చేద్దామన్నా. కానీ, కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఆలస్యమై ఇప్పటికి ప్రేక్షకుల ముందుకొస్తుంది.

* ‘కార్తికేయ’లో నేను వైద్య విద్యార్థిగా కనిపించా. ఇందులో పూర్తిస్థాయి డాక్టర్‌గా, పార్ట్‌ టైమ్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నా. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధపడే పాత్ర నాది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కథలో కొంతభాగం ఉత్తర భారతదేశంలో ఉంటుంది. దానికి అనుగుణంగా ఒక పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ను తీసుకున్నాం. ఆయన గొప్ప వ్యక్తి. తనతో కలిసి పని చేసేటప్పుడు కాస్త భయమనిపించింది. ఇందులో అనుపమ చాలా కొత్తగా కనిపిస్తుంది.

* ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ డబ్‌ చేస్తున్నాం. నా సినిమా ఇన్ని భాషల్లో విడుదలవడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి కాలభైరవ చక్కటి నేపథ్య సంగీతమందించారు. ఇందులో ఉన్న మూడు పాటలు ఆకట్టుకుంటాయి. సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నాకు అడ్వెంచర్‌ కథలైన టిన్‌ టిన్‌ బుక్స్‌ అంటే చాలా ఇష్టం. దర్శకుడు చందు కూడా ఈ పుస్తకాల్ని బాగా చదువుతాడు. ఇండియానా జోన్స్‌లా మనకూ ఎన్నో కథలున్నాయి. అవన్నీ తీసి భారతీయుల గొప్పతనాన్ని చూపించాలనుకుంటున్నా.

* కథ డిమాండ్‌ చేసినప్పుడే పాన్‌ ఇండియా చిత్రం తీయడం సాధ్యమవుతుంది. ఓ తెలుగు సినిమా తీసి.. దాన్ని మిగతా భాషల్లోకి డబ్‌ చేసినంత మాత్రాన అది అందరికీ అర్థం కాకపోవచ్చు. మనం ఏం చేయాలన్నా.. కథకు తగ్గట్లుగా వెళ్లాల్సిందే. ప్రస్తుతం నేను చేస్తున్న ‘18 పేజెస్‌’ ఇక్కడే విడుదలవుతోంది. ‘స్పై’.. ఏజెంట్‌ సినిమా కాబట్టి అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. అందుకే దాన్ని మిగతా భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నా.

* నా 14ఏళ్ల సినీ ప్రయాణం సంతృప్తికరంగా ఉంది. నా కెరీర్‌ కాస్త నెమ్మదిగానే ఉండొచ్చు కానీ, అకస్మాత్తుగా కింద పడిపోయిన సందర్భాలు లేవు. ఒక్కో అడుగు వేసుకుంటూ మెల్లగా పైకెదుగుతున్నా. ఈ ప్రయాణమే నాకు బాగా నచ్చింది. కథ బాగుంటే నేను ఏ తరహా పాత్ర పోషించడానికైనా సిద్ధమే. ‘బ్యాట్‌మెన్‌’ సినిమా తీసుకుంటే అందులో హీరో, విలన్‌ ఇద్దరికీ ప్రాధాన్యం ఉంటుంది. అందులో విలన్‌గా చేసిన నటుడికి ఆస్కార్‌ వచ్చింది. అప్పుడే ఫిక్స్‌ అయిపోయా.. ఇలాంటి మంచి క్యారెక్టర్స్‌ వస్తే తప్పకుండా చేయాలని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని