Bujji Ila Raa: బుజ్జీ హంగామా ఇలా!

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందినీ అయ్యంగార్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 14:07 IST

సునీల్‌ (Sunil), ధన్‌రాజ్‌ (Dhanraj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’ (Bujji Ila Raa). చాందినీ అయ్యంగార్‌ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు.  జి.నాగేశ్వర్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. కథానాయకుడు అల్లరి నరేష్‌ ముఖ్య    అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి. విజయవంతమైన ‘సీమశాస్త్రి’, ‘సీమటపాకాయ్‌’ సినిమాల్నిచ్చారు నా కెరీర్‌కి! అంజి ఛాయాగ్రాహకుడు కాకముందు నుంచే నాకు తెలుసు. తనకి దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఎప్పట్నుంచో చెప్పేవారు.     జి.నాగేశ్వర్‌రెడ్డి కథతో, అంజి ఈ సినిమా తీశారంటే కచ్చితంగా బాగుంటుందని నమ్మకం’’ అన్నారు. జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ   ‘‘కథ బాగుంటే సరిపోదు. నటీనటులు కీలకం. సునీల్‌, ధన్‌రాజ్‌ తదితర నటుల వల్ల ఈ సినిమా అద్భుతంగా ముస్తాబైంది. ఈ సినిమా విజయంతో అంజికి మంచి పేరు రావాలి. సినిమా ఆడకపోతే ఆ చెడ్డ పేరు నాకు రావాలని కోరుకుంటాను. ఈ సినిమాకి అసలైన హీరోలు నా స్నేహితులైన నిర్మాతలే’’ అన్నారు.    దర్శకుడు అంజి మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. కచ్చితంగా థ్రిల్‌ని పంచే చిత్రం అవుతుంద’’న్నారు. ‘‘ఈ సినిమాని మొదట నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలోనే చేయాలనుకున్నాం. కానీ ఆయన వేరే సినిమాతో బిజీగా ఉండటంతో అంజిని సంప్రదించాం. ఆయన మంచి దర్శకుడు. కథకి ఏమాత్రం తగ్గకుండా తీశార’’న్నారు నిర్మాతలు. ‘‘సీరియస్‌గా సాగే పాత్రని పోషించా. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘మహర్షి’, ‘నాంది’ తరహా సినిమాలు చేస్తున్న అల్లరి నరేషే   మాకు స్ఫూర్తి. ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయకుడు ధన్‌రాజ్‌. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్‌ అయ్యర్‌, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, చిత్ర సమర్పకుడు రూప జగదీష్‌, ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని