Tollywood: సెప్టెం‘బరిలో’...

ఆగస్టు నెల చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మూడు సినిమాలు ఘన విజయం సాధించడంతో బాక్సాఫీసు కళకళలాడింది. కొత్తగా కొబ్బరికాయ కొట్టాలా వద్దా? సిద్ధమైన చిత్రాలను విడుదల చేసుకోవాలా? లేదా? అనే సందేహాలతో సతమతమవుతూ సంక్షోభం దిశగా పయనిస్తున్న చిత్రసీమకి కొత్త ఊపిరిలూదాయి ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ల ఫలితాలు.

Updated : 20 Aug 2022 09:39 IST

ఆగస్టు ఆశ.. వచ్చే నెలపై ధ్యాస

వరుసగా చిన్నా, మధ్యస్థ చిత్రాలు

ఆగస్టు నెల చిత్రసీమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మూడు సినిమాలు ఘన విజయం సాధించడంతో బాక్సాఫీసు కళకళలాడింది. కొత్తగా కొబ్బరికాయ కొట్టాలా వద్దా? సిద్ధమైన చిత్రాలను విడుదల చేసుకోవాలా? లేదా? అనే సందేహాలతో సతమతమవుతూ సంక్షోభం దిశగా పయనిస్తున్న చిత్రసీమకి కొత్త ఊపిరిలూదాయి ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ల ఫలితాలు. కంటెంట్‌ ఉంటే ప్రేక్షకుల రాకపై సందేహాలే అవసరం లేదనే సంగతి రుజువు కావడంతో సినిమాలన్నీ వరుసగా విడుదల తేదీల్ని ప్రకటించేశాయి. దాంతో సెప్టెంబర్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించనుంది.  

విజయాలెన్ని... పరాజయాలెన్ననే సంగతిని పక్కనపెడితే ఈ ఏడాది ఆరంభం నుంచి బాక్సాఫీసు దగ్గర ఖాళీ అన్నదే లేదు. అన్‌సీజన్‌గా పరిగణించే ఫిబ్రవరిలోనూ 20కిపైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వేసవి తర్వాతా ఆ జోరు తగ్గలేదు. జూన్‌, జులై మాసాల్లో ఫలితాలు కలవరపెట్టినా... ఆగస్టులో మళ్లీ ఫామ్‌ అందుకుంది చిత్రసీమ. మార్చి, ఏప్రిల్‌ మాసాలతోనే అగ్ర తారల జోరు ముగిసినప్పటికీ... ఆ తర్వాత నుంచి మధ్యస్థాయి బడ్జెట్‌తో కూడిన సినిమాలే విడుదలవుతూ వచ్చాయి. సెప్టెంబర్‌లోనూ అగ్రతారల కంటే, పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాల హవానే కనిపించనుంది.


పాన్‌ ఇండియా చిత్రాల ఆకర్షణ

దసరా నుంచే అగ్ర తారల సందడి షురూ కానుంది. ఆలోపు పాన్‌ ఇండియా చిత్రాలు మాత్రం పోటాపోటీగా విడుదల కానున్నాయి. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘లైగర్‌’ ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం వచ్చే నెల తొలి వారం వరకు కొనసాగనుంది. ఆ వెంటనే ‘బ్రహ్మాస్త్ర’ హంగామా మొదలు కానుంది. రణ్‌బీర్‌కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌  9న విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌: 1’ సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘లాఠీ’ సందడి సెప్టెంబర్‌ నెలలోనే ఉంటుంది. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన ‘కోబ్రా’ ఆగస్టు 31న విడుదలవుతూ... ప్రేక్షకుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేపుతున్నాయి.


యువ హవా

చిన్నా, పెద్ద.. సినిమా అనే లెక్కలు ఇదివరకు వినిపించేవి. ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి. కథే ఆయా చిత్రాల స్థాయిని నిర్దేశిస్తున్నాయి. బలమైన కంటెంట్‌ ఉందంటే పరిమిత వ్యయంతో తెరకెక్కినవీ సంచలన  విజయాల్ని సొంతం చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రూ.వందల కోట్లతో రూపొందినవీ కథలో బలం లేదంటే రెండో ఆట నుంచే వెలవెలబోతుంటాయి. అందుకే తారాబలం కంటే, కంటెంట్‌పై నమ్మకంతోనే సినిమాల్ని అంచనా వేస్తుంటారు ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు. కథల్ని ఎంపిక చేసుకోవడంలో యువతరం కథానాయకులు తమదైన అభిరుభిని ప్రదర్శిస్తున్నారు. అందుకే వాళ్ల సినిమాలపైనా ప్రత్యేకమైన అంచనాలు కనిపిస్తుంటాయి. వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా, గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం సెప్టెంబర్‌ 2న విడుదలవుతోంది. ఇదే రోజున ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్‌ 9న విడుదలవుతోంది. శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న చిత్రమిది. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన ‘నేను మీకు బాగా  కావల్సినవాడిని’, సత్యదేవ్‌ ‘గుర్తుందా శీతాకాలం’ 9నే విడుదలకు ఖరారయ్యాయి. సుధీర్‌బాబు కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్‌ 16న విడుదలవుతోంది. విలక్షణమైన ప్రేమకథతో ఈ సినిమాని రూపొందించినట్టు దర్శకుడు చెబుతున్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘అల్లూరి’, నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్‌ 23న ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కి రీమేక్‌గా రూపొందిన ‘శాకిని డాకిని’తో పాటు, ‘దొంగలున్నారు జాగ్రత్త’ అదే నెలలో 16, 23 తేదీల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని