Ponniyin Selvan: ‘బాహుబలి’ వల్లే పొన్నియిన్‌ సెల్వన్‌

‘‘ఒక కథని విజయవంతంగా రెండు భాగాలుగా ఎలా చెప్పాలో రాజమౌళి చూపించారు. ‘బాహుబలి’ సినిమాల వల్లే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సాధ్యమైంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ‘పి.ఎస్‌.1’ పేరుతో    సెప్టెంబర్‌  30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 20 Aug 2022 09:40 IST

‘‘ఒక కథని విజయవంతంగా రెండు భాగాలుగా ఎలా చెప్పాలో రాజమౌళి చూపించారు. ‘బాహుబలి’ సినిమాల వల్లే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సాధ్యమైంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ‘పి.ఎస్‌.1’ పేరుతో సెప్టెంబర్‌  30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని చోళ చోళ... అంటూ సాగే పాటని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటని.. మనో, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకర్త. పాట విడుదల వేడుకని ఉద్దేశించి అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఒక కళాత్మకమైన చరిత్ర. ఒక చారిత్రాత్మకమైన కళ. ఇలాంటి సినిమాని చూడటానికి కళ్లు, పాటలు వినడానికి చెవులు ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇలాంటి సినిమాలో పనిచేయడానికి నాజన్మ ఎంత పుణ్యం చేసుకుందో అనుకుంటుంటా. ఈ సినిమాలో పాటలు రాయడం సవాల్‌గా అనిపించినా, ఎంతో సంతోషంగా స్వీకరించి ఏడు పాటలు పూర్తి చేశా. దానికి కారణం మణిరత్నం నాకు ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ల బృందం అందించిన సహకారం. నాకంటూ ఓ చరిత్ర ఉంటే అందులో బంగారు పుటల్లో రాసుకునే అనుభవం ఈ సినిమా ప్రయాణం. చోళ చోళ... పాట ఇంత ఘనంగా విడుదల కావడం ఓ ప్రత్యేకత’’ అన్నారు.

* విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘మణిరత్నంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రావణ్‌’ తర్వాత ఈ సినిమాలో నటించా. శంకర్‌, మణిరత్నం సినిమాల్లో నటించాకే రిటైర్‌మెంట్‌ కావాలని ముందే అనుకున్నా. మణిరత్నం సినిమాలో ఇలాంటి ఓ మంచి పాత్రని చేయడం నాకు దక్కిన ఓ భాగ్యం’’ అన్నారు.

* కార్తి మాట్లాడుతూ ‘‘నాకు చాలా ప్రత్యేకమైన వేదిక ఇది. మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ మొదలుపెట్టా. ఎంతోమంది చేయాలనుకున్న పాత్రని చేసే అవకాశం నాకు వచ్చింది. ఒకొక్కపాత్రకి ఒక్కో లక్ష్యం ఉంటుంది. సినిమా చివరలో ఆ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనేది ఆసక్తికరం. వెయ్యేళ్ల కిందట రాజ రాజ చోళ యువరాజుగా ఉన్నప్పుడు, ఆయన మహారాజు కాకముందు సాగే కథ ఇది. 90 శాతం నిజజీవిత పాత్రల ఆధారంగానే ఈ సినిమా రూపొంందింది. 140 రోజుల్లో రెండు భాగాల సినిమాల్ని పూర్తి చేశాం. గొప్ప సన్నివేశాల్ని తెరపై   చూడనున్నాం. రెహమాన్‌ సంగీతం, రవివర్మన్‌ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. నేను పాత  తెలుగు భాషలో డబ్బింగ్‌ చెబుతున్నా’’ అన్నారు.

* ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘తమిళనాట జనపదమై పోయిన ఓ కథ ఇది. దీన్ని 30 గంటల సినిమా చేయాలి. మణిరత్నం ఇప్పటికిప్పుడు అనుకుని కాకుండా, ఒక దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తూ చేసిన సినిమా ఇది’’ అన్నారు.

* సుహాసిని మాట్లాడుతూ ‘‘దీని గురించి తెలుసుకుని అందరూ ‘మీ ఆయన చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు, ఆయనకి సహకారం అందించు’ అన్నారు. మా ఆయన కష్టపడి తీయలేదు, ఇష్టపడి తీశారు. ఇది నీ కలల సినిమానా అడిగాను. లేదు, నాకు ఇష్టమైనది’’ అన్నారు.

* మణిరత్నం మాట్లాడుతూ ‘‘చిరంజీవి సహా చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనేది త్వరలోనే తెలుస్తుంది. రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటి కథల్ని ఎలా తీయాలో చెబుతూ తలుపులు తెరిచి మా అందరికీ దారి చూపించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, నాజర్‌ పాల్గొన్నారు.

* తనికెళ్ల భరణి మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘25 ఏళ్ల తర్వాత మళ్లీ నేను పెన్ను పట్టుకుని ఈ సినిమాకి మాటలు రాశా. దానికి కారణం మణిరత్నం. పాతికేళ్ల కిందట ‘దళపతి’ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మణిరత్నం ఫోన్‌ చేసి ఈ  సినిమాకి మాటలు రాయాలని కోరారు. జయరాం పోషించిన పాత్రకి కూడా  నేను డబ్బింగ్‌ చెప్పా. చాలా రకాలుగా గొప్ప అనుభవాల్నిచ్చిందీ చిత్రం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని