Tollywood: ఆరంభం.. సంరంభం

కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో చిత్రసీమ కళకళలాడింది. సోమవారం మంచిరోజు కావడంతో పలు సినిమాలకి శ్రీకారం చుట్టాయి ఆయా చిత్రబృందాలు. ఇప్పటికిప్పుడు చిత్రీకరణల కోసం సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితులు లేకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలయ్యాయి. అల్లు అర్జున్‌, అల్లరి

Updated : 23 Aug 2022 07:02 IST

సందడే సందడి..

కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో చిత్రసీమ కళకళలాడింది. సోమవారం మంచిరోజు కావడంతో పలు సినిమాలకి శ్రీకారం చుట్టాయి ఆయా చిత్రబృందాలు. ఇప్పటికిప్పుడు చిత్రీకరణల కోసం సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితులు లేకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలయ్యాయి. అల్లు అర్జున్‌, అల్లరి నరేష్‌, నాగశౌర్య తదితర కథానాయకుల చిత్రాలతో పాటు, మరికొన్ని ఆరంభమయ్యాయి. కొబ్బరికాయ కొట్టేశారు కాబట్టి... చిత్రీకరణలు ఎప్పుడు మొదలైతే అప్పుడు రంగంలోకి దిగనున్నారు తారలు.


‘పుష్ప2’ ప్రారంభం

భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది ‘పుష్ప’ మేనియా. తగ్గేదేలే... అనే డైలాగ్‌, ఆ మేనరిజమ్‌, పాటలు విశేష ప్రాచుర్యం పొందాయి. తెలుగుతోపాటు, హిందీలో, ఇతర భాషల్లోనూ సంచలన విజయం అందుకున్న ‘పుష్ప’కి కొనసాగింపుగా ఇప్పుడు ‘పుష్ప2’ రూపొందుతోంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు సుకుమార్‌కి చిత్రబృందం స్క్రిప్ట్‌ని అందజేసింది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణని మొదలు పెట్టనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ కార్యక్రమంలో చెర్రీ, రవిశంకర్‌, సుకుమార్‌, తబిత తదితరులు పాల్గొన్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఎస్‌.రామకృష్ణ, మోనిక నిగొత్రే, పాటలు:చంద్రబోస్‌.


కొత్త దర్శకుడితో...

నాగశౌర్య కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘హాస్యం నిండిన వాణిజ్య ప్రధానమైన కథ ఇది. యువతరం, కుటుంబ ప్రేక్షకుల్లో నాగశౌర్యకి వున్న ఆదరణకి తగ్గట్టుగానే ఈ కథని సిద్ధం చేశారు కొత్త దర్శకుడు పవన్‌. ఇది ప్రత్యేకంగా ఉండబోతోంది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’కి సంగీతం అందించిన ఏఆర్‌ రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూరుస్తున్నార’’ని సినీవర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌.


అల్లరి నరేష్‌ హీరోగా ‘ఉగ్రం’

‘నాంది’తో విజయాన్ని అందుకున్నారు అల్లరి నరేష్‌ - విజయ్‌ కనకమేడల. నరేష్‌ సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది ఆ చిత్రం. దర్శకుడిగా విజయ్‌ కనకమేడల తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేశారు. ఈ ఇద్దరూ కలిసి ‘ఉగ్రం’ పేరుతో మరో సినిమా చేస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌నివ్వగా, నిర్మాత కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. స్టార్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు, లోకేశ్వరి స్క్రిప్ట్‌ని అందజేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌నీ విడుదల చేశారు. ‘‘విజయ్‌ కనకమేడల మరోసారి శక్తివంతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నరేష్‌ని మరోసారి విభిన్నమైన పాత్రలో ఆవిష్కరిస్తారు. వచ్చేనెలలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెడతాం. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: సిద్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్రహ్మకడలి, కథ, తూము వెంకట్‌.


రాజకీయం నేపథ్యంలో... ‘యథారాజా తథా ప్రజా’

ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యథా రాజా తథా ప్రజా’. ‘సినిమా బండి’ ఫేమ్‌ వికాస్‌ మరో కథానాయకుడు. శ్రష్టివర్మ కథానాయిక. శ్రీనివాస్‌ విట్టల దర్శకత్వం వహిస్తూనే... హరీష్‌ పటేల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు శర్వానంద్‌ క్లాప్‌నిచ్చారు. ఆయుష్‌ శర్మ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు కుమార్‌.. గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్‌ విట్టల మాట్లాడుతూ ‘‘పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. సెప్టెంబర్‌ 15 నుంచి చిత్రీకరణ మొదలు పెడతాం. మూడు షెడ్యూళ్లలో పూర్తి చేస్తాం. ఇందులో నాలుగు పాటలున్నాయి. రధన్‌ మంచి బాణీలు అందించారు’’ అన్నారు. జానీ మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘వాణిజ్యాంశాలు, డాన్స్‌ మాత్రమే కాకుండా మంచి కథ ఉంటే బాగుంటుందనుకున్నా. అలాంటి కథే చెప్పారు దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రధన్‌, ఛాయాగ్రాహకుడు సునోజ్‌ వేలాయుధన్‌, గణేష్‌ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రేమజంట ప్రయాణం

హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకుడిగా సాయివిలా సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుమీత కథానాయిక. అంజన్‌ చెరుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. రావుల లక్ష్మణ్‌రావ్‌, రావుల శ్రీను నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో సోమవారం లాంఛనంగా మొదలైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. టి.ప్రసన్నకుమార్‌, డి.ఎస్‌.రావు, మాధవి తదితరులు హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక మధ్య తరగతి ప్రేమజంట తన ప్రయాణంలో చేజిక్కించుకున్న అవకాశం చుట్టూ సాగే కథ ఇది. ఆశల పల్లకీలో అందరూ ఊగుతారు, ఈ జంట ఆ ఆశల్ని ఎలా నెరవేర్చుకుందనేది కథలో కీలకం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చిరంజీవి నా అభిమాన నటుడు. ఆయన పుట్టినరోజున సినిమా ప్రారంభించాలని ముందే అనుకున్నాం. సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ షురూ అవుతుంది. మా మొదటి చిత్రం ‘రుద్రవీణ’ విడుదలకి సిద్ధంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో గౌతంరాజు, వి.వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని