కేడీ సందడి

ఒక్కసారి చేయి పట్టుకున్నాక చచ్చేదాక వదలనంటాడు ఆ యువకుడు. మరి అతని ప్రేమకథలో అనూహ్యంగా ఎలాంటి మలుపులు  చోటు చేసుకున్నాయో తెలియాలంటే ‘లెహరాయి’ చూడాల్సిందే. రంజిత్‌, సౌమ్యమేనన్‌ జంటగా తెరకెక్కిన చిత్రమిది.

Updated : 16 Sep 2022 06:18 IST

‘మేజర్‌’తో ఘన విజయాన్ని అందుకున్న అడివి శేష్‌... ఈ ఏడాదిలోనే మరో సినిమాతో సందడి చేయనున్నాడు. ఆయన కథానాయకుడిగా శేలైష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్‌ 2’ డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని చిత్రబృందం గురువారం అదికారికంగా ప్రకటించింది. తెలుగులో విజయవంతమైన ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన చిత్రమే... ‘హిట్‌ 2’. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. కథానాయకుడు నాని సమర్పకులు. ‘‘కృష్ణదేవ్‌ అలియాస్‌ కేడీ పాత్రలో  సందడి చేయనున్నారు కథానాయకుడు అడివి శేష్‌. తొలి సినిమా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ అధికారి అమ్మాయి మిస్సింగ్‌ కేసు చుట్టూ సాగింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్‌ అధికారి కేడీ చేపట్టిన మరో కేస్‌ చుట్టూ సాగుతుంది. పక్కా పరిశోధనాత్మక డ్రామా సినిమాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ అంశాలతో తెరకెక్కించారు శైలేష్‌ కొలను. మనికందన్‌ కెమెరా పనితనం, జాన్‌ స్టీవర్ట్‌ సంగీతం ఆకర్షణగా నిలుస్తుంద’’ని తెలిపాయి సినీ వర్గాలు. మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భానుచందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు నటించారు.


ఎవరూ చేయని ప్రయోగం

దొంగతనం కోసం కార్‌ ఎక్కాడు. అనుకున్న పని చక్కబెట్టుకున్నాడు. ఇక దిగిపోదామనుకునేలోపు కార్‌ లాక్‌ అయిపోయింది. ఎంతకీ బయటికి రావడం లేదు. మరి ఆ దొంగ బయటపడ్డాడా?  లేక దొరికిపోయాడా? తెలియాలంటే ‘దొంగలున్నారు జాగ్రత్త’ చూడాల్సిందే. శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. సతీష్‌ త్రిపుర దర్శకుడు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. కథానాయకుడు శ్రీసింహా మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు. ఇలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసినందుకు దర్శకనిర్మాతలకి కృతజ్ఞతలు. ప్రతీఅస్రాణి పాత్ర చాలా కీలకం. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సముద్రఖని తమ అనుభవాన్ని రంగరించి నటించారు. థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులందరికీ వినోదం పంచే చిత్రమిది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌ ‘దృశ్యం’ సినిమాకి అసోసియేట్‌గా పనిచేశా. ‘దొంగలున్నారు జాగ్రత్త’ చేస్తున్నానని తెలిసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు. ఈ స్క్రిప్ట్‌ విషయంలో వెన్నెముకలా నిలిచారు నిర్మాత సునీత తాటి, రవి. శ్రీసింహా చాలా కష్టపడి పనిచేశారు. కళా దర్శకుడు గాంధీ నడికుడికర్‌ ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. గొప్ప థియేటర్‌ అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీతి అస్రాణి, యశ్వంత్‌, గాంధీ నడికుడికర్‌తో తదితరులు పాల్గొన్నారు.


భావోద్వేగాల ‘లెహరాయి’

క్కసారి చేయి పట్టుకున్నాక చచ్చేదాక వదలనంటాడు ఆ యువకుడు. మరి అతని ప్రేమకథలో అనూహ్యంగా ఎలాంటి మలుపులు  చోటు చేసుకున్నాయో తెలియాలంటే ‘లెహరాయి’ చూడాల్సిందే. రంజిత్‌, సౌమ్యమేనన్‌ జంటగా తెరకెక్కిన చిత్రమిది. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కం వేణుగోపాల్‌ సమర్పకుడు. గగన్‌ విహారి, రావురమేష్‌, నరేష్‌, అలీ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా టీజర్‌ని గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మంచి కథతో వస్తున్న రూపొందిన సినిమా ఇది. బెక్కం వేణుగోపాల్‌ కొత్తతరాన్ని ప్రోత్సహిస్తుంటారు. ఘంటాడి కృష్ణ పాటలు బాగున్నాయి’’ అన్నారు. భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు దర్శకుడు. యువతరానికి ఓ మంచి సందేశంతోపాటు ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిదన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, నటి సంధ్యజనక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని