Ponniyin Selvan: మణిరత్నం 40 ఏళ్ల కల... ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. జయం రవి, విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శరత్‌కుమార్‌, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.

Updated : 24 Sep 2022 14:05 IST

‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. జయం రవి, విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శరత్‌కుమార్‌, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాస్కరన్‌ నిర్మాత. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో తొలి భాగం ‘పీఎస్‌1’గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం  హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు కార్తి మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మాధ్యమమో గుర్తుకొస్తుంది. మణిరత్నం సర్‌ 40 ఏళ్ల కల ఈ సినిమా’’ అన్నారు. విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘నాన్న, అపరిచితుడు... ఇలా ఒకొక్క సినిమాలో ఒకొక్క భావోద్వేగం నచ్చుతుంది. ఈ సినిమాలో గుర్రంపై వచ్చే ఒక్క షాట్‌ చాలు అనిపించింది’’ అన్నారు. సుహాసిని  మాట్లాడుతూ ‘‘పెళ్లికి ముందు మణిరత్నం నాకొక బహుమానం ఇచ్చారు. చోళ హోటల్‌లోకి పెద్ద బ్యాగ్‌ తీసుకొచ్చి ఐదు వాల్యూమ్స్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ నవలలు ఇచ్చి చదివి, లైన్‌గా రాసి ఇవ్వు అన్నారు. ప్రతీ ఛాప్టర్‌ చదివి ఒకొక్క లైన్‌ రాసి ఇచ్చా. వన్‌ లైన్‌ ఆర్డర్‌ అంటే ఇలాగా రాసేది అన్నారు. పెళ్లి చేసుకోరేమో అనుకున్నా (నవ్వుతూ). 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేశారు. దానికి కారణం సుభాస్కరన్‌. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి’’ అన్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘38 ఏళ్లుగా తెలుగులో పనిచేస్తున్నా. రమేష్‌నాయుడు, చక్రవర్తి, రాజ్‌ కోటి, సత్యం... ఇలా వీళ్లందరితో కలిసి చేసిన ప్రయాణంతో నా కెరీర్‌కి పునాదులు పడ్డాయి. భాష, కవిత్వం, గౌరవం.... వీటన్నిటికీ కృతజ్ఞతలు. ఈ సినిమా తర్వాత నేను ఓటీటీల్లో సిరీస్‌లు చూడటం మానేశాను. మన సంస్కృతి, మన రక్తం, మనవాళ్లు చేసిన సినిమా ఇది. గొప్పగా ఉంది’’ అన్నారు. ఐశ్వర్యరాయ్‌ మాట్లాడుతూ ‘‘సెల్యూటాయిడ్‌పై ఓ పెయింట్‌ని సృష్టించాం. మణిరత్నం కలకి జీవితాన్నిచ్చే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో త్రిష, కార్తి, జయం రవి, దిల్‌రాజు, శోభిత ధూళిపాళ తదితరులు పాల్గొన్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు