Tollywood: మనసింత ఉల్లాసంగా ఉన్నా..!

అశోక్‌ సెల్వన్‌ హీరోగా ఆర్‌.ఎ.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశం’. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ శుక్రవారం విడుదల చేశారు

Updated : 24 Sep 2022 14:03 IST

అశోక్‌ సెల్వన్‌ హీరోగా ఆర్‌.ఎ.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశం’. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ శుక్రవారం విడుదల చేశారు. ‘‘హేయ్‌ అర్జున్‌.. మనసింత ఉల్లాసంగా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి కదూ’’ అంటూ రీతూ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఇందులో అశోక్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముగ్గురు నాయికలతో అతనికి ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ మూడు ప్రేమ కథల్లోనూ బలమైన భావోద్వేగాలు నిండి ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తుంది. మరి ఈ కథలన్నీ సుఖాంతమయ్యాయా? లేదా? తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: లీలావతి కుమార్‌.


ఎడారిలో పుష్పం

అనంతపురం జిల్లా తెదేపా నేత చమన్‌సాబ్‌ జీవితం ఆధారంగా ‘చమన్‌’ పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. ఎడారిలో పుష్పం...అనేది ఉపశీర్షిక. వెంకట్‌ సన్నిధి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి.చౌదరి నిర్మాత. ఈ సినిమా టైటిల్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘చమన్‌సాబ్‌ బతికున్న రోజుల్లోనే ఈ స్క్రిప్ట్‌ పూర్తి చేశాం. కరోనా కారణంగా ఆలస్యమైంది. చమన్‌ స్నేహితుడిగా ఆయన జీవితంపై ఈ సినిమాని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి చమన్‌సాబ్‌. ఆయన గురించి అందరికీ తెలిసేలా, ఎవ్వరినీ కించపరచని రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. కార్యక్రమంలో సి.రాంప్రసాద్‌, మోహిత్‌ రెహమాన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని