Swathi muthyam: కమల్‌హాసన్‌ పాత్రతో పోలుస్తారేమోనని భయపడ్డా!

‘‘అమాయకత్వంతో కూడిన పాత్రల మధ్య సాగే సహజత్వం నిండిన కథ ‘స్వాతిముత్యం’. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్‌ కె.కృష్ణ. ‘స్వాతిముత్యం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడీయన.

Updated : 25 Sep 2022 08:24 IST

‘‘అమాయకత్వంతో కూడిన పాత్రల మధ్య సాగే సహజత్వం నిండిన కథ ‘స్వాతిముత్యం’. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్‌ కె.కృష్ణ. ‘స్వాతిముత్యం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడీయన. ఈ సినిమాతోనే హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు బెల్లంకొండ గణేష్‌. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు లక్ష్మణ్‌.

* ‘‘వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిది. ఓ సాధారణ పెళ్లిలోనూ ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించనున్నాం. నా అభిమాన హీరో చిరంజీవి సినిమా విడుదలవుతున్న రోజే నా చిత్రం విడుదలవుతోంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’.

* ‘‘ఈ కథ రాసుకున్నాక.. దీన్ని కొత్త వాళ్లతోనే చేయాలనుకున్నా. అప్పుడే గణేష్‌ కూడా తన తొలి చిత్రం కోసం కథలు ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. ఆ సమయంలో ఓ ఫ్రెండ్‌ ద్వారా తనని కలిశాను. ఈ కథ వినిపించగానే నచ్చిందని చెప్పారు. తర్వాత ఆయన తన తండ్రి సురేష్‌కు చెప్పడం.. ఆయన ద్వారా మేము సితారకు రావడం జరిగాయి’’.

* ‘‘నా చుట్టూ నేను చూసిన సంఘటనల నుంచే ఈ కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్లు ఎలా స్పందిస్తారు.. పక్కింటి వాళ్లు ఎలా స్పందిస్తారు? ఎవరి ఎమోషన్స్‌ ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఇందులో విలన్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. పరిస్థితులే కథలోని మలుపులకు కారణమవుతాయి. ఒక టౌన్‌లో కొన్ని అమాయకమైన పాత్రల మధ్య జరిగే కథ కాబట్టి.. నిర్మాతల సలహాతో ‘స్వాతిముత్యం’ అనే టైటిల్‌ పెట్టాం. మొదట ఈ టైటిల్‌ విన్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారేమోనని భయం వేసింది. కమల్‌హాసన్‌ నటించిన ‘స్వాతిముత్యం’లోని పాత్రతో పోలుస్తారేమోనని భయపడ్డా’’.

* ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఇంజినీరింగ్‌ మధ్యలో వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేశా. చిన్న చిన్న లఘు చిత్రాలు తీయడం మొదలుపెట్టా. ఈ క్రమంలోనే ‘కృష్ణమూర్తి గారింట్లో’ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు సైమా షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కించుకున్నా. ఇక లాక్‌డౌన్‌ టైమ్‌లో మంచి ఫ్యామిలీ సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఈ చిత్ర కథ రాసుకున్నా. నాకు దర్శకత్వంలో మణిరత్నం, వంశీ, బాపు వంటి వారే స్ఫూర్తి’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని