పేరు అది కాదంట

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మానుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో

Updated : 27 Sep 2022 08:07 IST

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మానుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాకి మొదట ‘ప్రేమ కాదంట’ అనే పేరుని ప్రకటించారు. ఇప్పుడు ఆ పేరుకి బదులుగా ‘ఊర్వశివో రాక్షసివో’ అని మార్చినట్టు చిత్రబృందం సోమవారం అధికారికంగా తెలిపింది. ఈ నెల 29న టీజర్‌ని విడుదల చేయనున్నారు. నవంబరు 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘‘యువతరం ఆలోచనల్ని అద్దం పట్టే కథ ఇది. ప్రేమ, హాస్యం కీలకం. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: తన్వీర్‌.


ఆమే ఒక సైన్యం

వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. మహర్షి కూండ్ల సమర్పకులు. తెలుగు, తమిళంతోపాటు, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కొడైకెనాల్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసం చుట్టూ సాగే కథ ఇది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా కనిపిస్తారు. ప్రాణాల్ని పణంగా పెట్టి కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరి సైన్యంలా పోరాడే తల్లిగా, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తార’’ని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘బలమైన కథ ఇది. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలు కీలకం.’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.


యాక్షన్‌.. ‘గణా’

విజయ్‌కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గణా’. సుకన్య, తేజు కథానాయికలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒక వ్యక్తి కృషి, పట్టుదల, దీక్షే ఈ చిత్రం. విజయ్‌ కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ తనే నిర్మించడం మామూలు విషయం కాదు. ఎంతోమంది సహకారం దీని వెనక ఉంది. అందరూ ఓ మంచి సినిమా తీయాలనే తలపుతో కలిశారు. తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. విజయ్‌కృష్ణ మాట్లాడుతూ ‘‘హీరోగా నా మూడో సినిమా ఇది. ఇంతకుముందు ‘దుర్మార్గుడు’, ‘గోవిందా భజ గోవింద’ సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశా. ‘పాగల్‌’లో విలన్‌గా నటించా. తొలిసారి నా దర్శకనిర్మాణంలో నేనొక సినిమా చేశా. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, రామారెడ్డి పసలపూడి, రమేష్‌ చందు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని