Tollywood: కొత్త ఊసుల కోసం... అక్టోబరు మాసం

అగ్ర తారల సినిమాల విడుదలలు... కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు... కొత్త లుక్స్‌... కొత్త కబుర్లతో సినీ అభిమానుల్ని మురిపించనుంది అక్టోబరు మాసం నెల. కొన్ని నెలలుగా పరిమిత వ్యయంతో కూడిన సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది సినీ ప్రేమికులు.

Updated : 27 Sep 2022 07:03 IST

అగ్ర తారల సినిమాల విడుదలలు... కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు... కొత్త లుక్స్‌... కొత్త కబుర్లతో సినీ అభిమానుల్ని మురిపించనుంది అక్టోబరు మాసం నెల. కొన్ని నెలలుగా పరిమిత వ్యయంతో కూడిన సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది సినీ ప్రేమికులు. సెట్స్‌పైకి వెళతాయనున్న పలువురు అగ్ర తారల సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. వచ్చే నెల నుంచి ఆ సినిమాలన్నీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. దసరా, దీపావళి పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ సందర్భంగా కొత్త సినిమాలు, కొత్త కలయికల కబుర్లు కూడా వినిపించనున్నాయి.

వేసవి తర్వాత బాక్సాఫీసు యువ కథానాయకులకే అంకితమైంది. స్టార్‌ హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. మళ్లీ బాక్సాఫీసు దగ్గర అసలు సిసలు హంగామా దసరా నుంచే మొదలవుతోంది. చిరంజీవి, నాగార్జున నటించిన ‘గాడ్‌ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’ అక్టోబరు 5న విడుదలవుతున్నాయి. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’తోపాటు మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. వాయిదా పడుతూ వచ్చిన కొత్త సినిమాలు పట్టాలెక్కడానికి కూడా ఇదే తరుణంగా కనిపిస్తోంది. ఆ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ సినిమాలు ముందు వరసలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘పుష్ప2’ అక్టోబరులోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. చాలా రోజులుగా పూర్వ నిర్మాణ పనుల్ని నిర్వహిస్తోంది చిత్రబృందం. దాదాపుగా ఆ పనులు పూర్తి కావడంతో ఇక అల్లు అర్జున్‌ కెమెరా ముందుకు రావడం పక్కా అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ - కొరటాల కలయికలలో రూపొందనున్న సినిమాకి సంబంధించిన కసరత్తులు కూడా పూర్తయినట్టు తెలిసింది. ఇటీవలే ఎన్టీఆర్‌ పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ విని పక్కా చేసినట్టు తెలిసింది. దాదాపుగా అక్టోబర్‌ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. పవన్‌కల్యాణ్‌ కూడా తన సినిమా ‘హరి హర వీరమల్లు’ని అదే నెలలోనే పునః ప్రారంభించనున్నట్టు సమాచారం. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా రంగంలోకి దిగనుంది.

ప్రచార సందడి

పండగలు వచ్చాయంటే చిత్రసీమలో ప్రచార హంగామా ఓ స్థాయిలో సాగుతుంటుంది. భలే మంచి రోజు అంటూ ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తుంటారు సినీ రూపకర్తలు. కొత్త కలయికల్ని, సినిమాల పేర్లనీ ప్రకటిస్తుంటారు. వేడుకల్నీ నిర్వహిస్తుంటారు. ఆ తరహా సందడి దసరా, దీపావళి సందర్భంగా గట్టిగానే సాగనున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌లుక్‌ని దసరా సందర్భంగానే విడుదల చేయనున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబరు 23న కాబట్టి ఆ సందర్భంగా కూడా ఆయన సినిమాలకి సంబంధించి సందడి కనిపించనుంది. బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందుతున్న సినిమా పేరుని దసరా సందర్భంగానే ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. మహేష్‌ సినిమా పేరు గురించి కూడా ప్రచారం సాగుతోంది. కొత్త కలయికల వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నాని, నాగచైతన్యతోపాటు పలువురు యువ కథానాయకులు ఈమధ్యే కొత్త కథలకి పచ్చజెండా ఊపేశారు. ఆ వివరాలన్నీ కూడా అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అక్టోబరు నుంచి తెలుగు చిత్రసీమలో ఓ కొత్త ఊపు కనిపించనుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts