పెళ్లి.. ఓ విచిత్రమైన సమస్య!

‘‘స్వాతిముత్యం’ చాలా సరదాగా ఉంటుంది. మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరిగే కథలా ఉంటుంది’’ అన్నారు గణేష్‌. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమే ‘స్వాతిముత్యం’.

Published : 27 Sep 2022 02:25 IST

‘‘స్వాతిముత్యం’ చాలా సరదాగా ఉంటుంది. మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరిగే కథలా ఉంటుంది’’ అన్నారు గణేష్‌. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమే ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో గణేష్‌ మాట్లాడుతూ.. ‘‘2020 కొవిడ్‌ టైమ్‌లో దర్శకుడు లక్ష్మణ్‌ నాకీ కథ వినిపించారు. ఈ కథ చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మి సితార దగ్గరకు తీసుకెళ్లా. తొలిసారి నన్ను నేను పెద్ద తెరపై చూసుకుంటున్నాను. కాస్త ఒత్తిడిగా ఉంది. సినిమా చాలా బాగుంది. అందరికీ నచ్చుతుంది. వర్ష నన్ను ఓ కొత్త హీరోలా చూడలేదు. సెట్‌లో చాలా ప్రోత్సాహం అందించింది’’ అన్నారు. ‘‘ఇది రెగ్యులర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాదు. సినిమాలో ఓ కొత్త అంశం ఉంది. చిన్న టౌన్‌లో ఉండే ఒక అబ్బాయి కథగా ఉంటుంది. అతనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వెంటనే కుటుంబం పెళ్లి చేయాలనుకుంటుంది. అలాంటి సందర్భంలో ఆ అబ్బాయికి అనుకోని విధంగా ఓ విచిత్ర సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కొన్నాడు? దానికి అతని కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు? అన్నది ఆసక్తికరంగా చూపించాం. కథ రాసుకున్నప్పుడే నాయికగా వర్షను అనుకున్నా. నన్ను, నా స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత వంశీ, హీరో గణేష్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు చిత్ర దర్శకుడు. నాయిక వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రతిభకు పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశమివ్వడమనేది చాలా పెద్ద విషయం. గణేష్‌కు ఇది తొలి చిత్రమైనా.. చాలా అద్భుతంగా చేశారు. తను పడిన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నా. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అంది. ‘‘పండగకి సరిపోయే కుటుంబ కథా చిత్రమిది. అందుకే దసరాకి విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత నాగవంశీ.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts