Tollywood: క్యాంపస్‌ వినోదం.. ర్యాంకుల సందేశం...

ర్యాంకుల పరుగులో మానవత్వాన్ని మరిచిపోతున్న విద్యా సంస్థల యాజమాన్యాలు ఒకపక్క! విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్లు మరోపక్క! వీటి మధ్య నలిగిపోతూ ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ కాన్సెప్ట్‌కి క్యాంపస్‌ వినోదాన్ని

Updated : 28 Sep 2022 06:57 IST

ర్యాంకుల పరుగులో మానవత్వాన్ని మరిచిపోతున్న విద్యా సంస్థల యాజమాన్యాలు ఒకపక్క! విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్లు మరోపక్క! వీటి మధ్య నలిగిపోతూ ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ కాన్సెప్ట్‌కి క్యాంపస్‌ వినోదాన్ని జోడిస్తూ... అందరినీ ఆలోచింపజేలా ‘వెల్‌కమ్‌ టు తీహార్‌ కాలేజ్‌’ (Welcome To Tihar College) చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో డా.ఎల్‌.ఎన్‌.రావు, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన చిత్రమిది. మనోజ్‌ నందం, చక్రి, మనీషా, సోనిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్‌ ఇమ్మడి స్వరకర్త. అక్టోబర్‌ 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని పాటల్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘విద్యార్థులతోపాటు... వాళ్ల తల్లిదండ్రులకీ, విద్యావేత్తలకీ, యాజమాన్యాలకీ అందరికీ కనెక్ట్‌  అయ్యేలా ఉంటుంది. సమాజంలో మార్పునకు దోహదం చేసేంతగా కథ, కథనాలు ప్రభావం చూపిస్తాయ’’న్నారు  ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు, అజయ్‌కుమార్‌,  జయచంద్రారెడ్డి, ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ, సుభాష్‌, భార్గవ్‌, నికిలేష్‌ భరద్వాజ, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


అందాల అప్సరస

రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లెహరాయి’ (Lehrayi). రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కం వేణుగోపాల్‌ సమర్పకుడు. గగన్‌ విహారి, రావు రమేష్‌, నరేష్‌, అలీ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంలోని ‘అప్సరస.. అప్సరస...’ పాటని విడుదల చేస్తున్నారు. శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్‌ ఆలపించారు. ఘంటాడి కృష్ణ స్వరకర్త. ‘‘అనుభూతిని పంచే కథ ఇది. ఏడు పాటలున్నాయి. ఘంటాడి కృష్ణ స్వరకల్పనలోని ఆ పాటలన్నీ అలరిస్తాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.


తెలిసినవాళ్ల కుటుంబ హత్యలు

రామ్‌ కార్తీక్‌ (Ram karthik), హెబ్బా పటేల్‌ (Hebah Patel) జంటగా తెరకెక్కిన చిత్రం ‘తెలిసినవాళ్ళు’ (Telisinavallu). విప్లవ్‌ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘రొమాన్స్‌, ఫ్యామిలీ, థ్రిల్లర్‌ జోనర్ల మేళవింపు ఈ చిత్రం. కుటుంబాల ఆత్మహత్యల నేపథ్యంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం’’ని సినీ వర్గాలు తెలిపాయి.


‘హౌస్‌ హజ్బెండ్‌’ కథేంటి?

శ్రీకర్‌, అపూర్వ జంటగా హరికృష్ణ జినుకల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హౌస్‌ హజ్బెండ్‌’ (Half Husband). భానుచందర్‌, సుమన్‌, గిరిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్ర దర్శక నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇదొక సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. కొవిడ్‌ టైమ్‌లో కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘ఇంటిపట్టునే ఉండే భర్త కావాలనుకున్న ఓ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది చిత్ర కథాంశం’’ అన్నారు హీరో శ్రీకర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని