రామ్‌కి జోడీగా...

యువ కథానాయకుడు రామ్‌... ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నట్టు సమాచారం. ఒక కథానాయికగా సాక్షి వైద్య ఎంపికైనట్టు

Updated : 28 Sep 2022 07:01 IST

యువ కథానాయకుడు రామ్‌ (Ram)... ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నట్టు సమాచారం. ఒక కథానాయికగా సాక్షి వైద్య ఎంపికైనట్టు తెలిసింది. అఖిల్‌తో కలిసి ‘ఏజెంట్‌’లో నటిస్తున్న కథానాయిక ఆమె. మరో కథానాయిక ఎంపిక కోసం ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్‌ ఓ కొత్త లుక్‌తో సందడి చేయనున్నట్టు తెలిసింది.


హత్య చేసిందెవరు?

ది సాయికుమార్‌ (Aadi SaiKumar) హీరోగా శివశంకర్‌ దేవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సిఎస్‌ఐ సనాతన్‌’ (CSI Sanatan). అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. మిషా నారంగ్‌ కథానాయిక. అలీ రెజా, నందిని రాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ఓ హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి చిన్న ఆధారాన్నీ ఆయన తన నివేదికలో పొందుపరచడం ప్రచార చిత్రంలో కనిపించింది. మరి తనకు దొరికిన ఆధారాల సాయంతో ఆయన నేరస్థుల్ని ఎలా పట్టుకోనున్నాడు? ఈక్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోనున్నాడు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ‘‘ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. హత్య కేసు విచారణ సాగే క్రమం ఆద్యంతం థ్రిల్‌ పంచుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్‌ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అనీష్‌ సోలోమాన్‌, ఛాయాగ్రహణం: జి.శేఖర్‌.


ఒంటరితనం నేపథ్యంలో... ‘స్కై’  

నంద్‌, మురళీ కృష్ణంరాజు, శ్రుతిశెట్టి, మెహబూబ్‌ షేక్‌, రాకేష్‌ మాస్టర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కై’ (Sky). పృథ్వీ పేరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మాతలు. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ‘‘ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుందనే అంశం చుట్టూ సాగే కథ ఇది. ఆలోచింపజేసే కథ, కథనం ఈ సినిమా ప్రత్యేకం. రసూల్‌ ఎల్లోర్‌ కెమెరా పనితనం, సురేష్‌ కూర్పు ప్రధానబలం’’ అని దర్శకుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని