Satyadev: నా ఎదుగుదల వెనుక.. ఎన్నో శుక్రవారాలున్నాయి!

‘‘సోలో కథానాయకుడిగానే చేయాలన్న స్వార్థం నాకూ ఉంటుంది. అదే సమయంలో అద్భుతమైన పాత్రలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనిపిస్తుంది. అందుకే నాలోని నటుణ్ని ఉత్తేజితుణ్ని చేసే ఏ తరహా పాత్రనైనా తప్పకుండా చేస్తుంటా’’ అన్నారు

Updated : 28 Sep 2022 10:04 IST

‘‘సోలో కథానాయకుడిగానే చేయాలన్న స్వార్థం నాకూ ఉంటుంది. అదే సమయంలో అద్భుతమైన పాత్రలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనిపిస్తుంది. అందుకే నాలోని నటుణ్ని ఉత్తేజితుణ్ని చేసే ఏ తరహా పాత్రనైనా తప్పకుండా చేస్తుంటా’’ అన్నారు సత్యదేవ్‌. ఇప్పుడాయన ‘గాడ్‌ఫాదర్‌’లో (GodFather) ఓ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మోహన్‌రాజా (MohanRaja) తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సత్యదేవ్‌.

‘‘అన్నయ్య (చిరంజీవి) (Chiranjeevi) ఓరోజు సెట్‌లో లంచ్‌కి రమ్మంటే వెళ్లాను. వెళ్లగానే కూర్చోబెట్టి ఓ కథ ఉందని చెప్పడం ప్రారంభించారు. ఆయన నాకు కథ చెప్పడమేంటని నేను ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తూ కూర్చున్నాను. నేనెప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవమిది. నా గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నన్ను కూర్చోబెట్టి కథ.. పాత్ర గురించి చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. మధ్యలో ఆయన ఆగి నా వంక చూసి ‘నేను సరిగ్గా కథ చెప్పడం లేదా? పోనీ దర్శకుడితో చెప్పించనా?’ అని అడిగారు. ‘మీరు నాకిలా చెప్పడం ఓ కలలా ఉందన్నయ్యా. దీనికి మించి నాకేం అర్థం కావట్లేదు. మీరు చేయమని చెప్తే చేసేస్తాను. ప్రత్యేకంగా మీరు కథ చెప్పడం దేనికి’ అన్నా. తర్వాత ‘లూసీఫర్‌ సినిమా చూశావా?’ అన్నారు. ‘చూడలేదు.. చూడను కూడా.. చేసేస్తాను’ అని చెప్పా. నిజంగానే ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా చూడాలన్న ఆలోచనే రాలేదు. ఆ క్షణం నాకు చాలా గొప్పగా అనిపించింది. అయితే సినిమా చేస్తున్నాననే కానీ.. అందులో ఉన్న పాత్ర లోతు నాకంత తెలియదు. సెట్లోకి అడుగు పెట్టి ఆ పాత్ర చేస్తున్నప్పుడే దాని లోతు కొంచెం కొంచెం అర్థమైంది. అప్పుడే లోలోపల చిన్న టెన్షన్‌ కూడా మొదలైంది (నవ్వుతూ)’’.

క్లైమాక్స్‌ కనులవిందులా..

‘‘అన్నయ్య చిరంజీవికి మాత్రమే సరిపడే కథ ఇది. తన ఇమేజ్‌ను పక్కకు పెట్టి మరీ ఈ చిత్రం కోసం రంగంలోకి దిగారు. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. సినిమాలో ఇంటర్వెల్‌ బ్లాక్‌ నాకు చాలా ఇష్టం. ఇక క్లైమాక్స్‌ మరింత అద్భుతంగా ఉంటుంది. అందులో 14 నిమిషాల పాటు సాగే యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆద్యంతం ఎత్తుకు పైఎత్తు అన్నట్లుగా సాగుతుంటుంది చిత్ర కథ. చిరు అన్నని మెగాస్టార్‌ అని ఎందుకు అంటారో ఆయన్ని దగ్గరగా చూస్తే బాగా అర్థమైంది. క్రమశిక్షణకు మారుపేరు ఆయన. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటారు. తెరపై చూసి ఆయనకు అభిమానినయ్యా. ఆయన్ని దగ్గర్నుంచి చూశాక తనపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. సెట్లో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఇచ్చే ఒక్కో సలహా, సూచనకు 45ఏళ్ల అనుభవం ఉంటుంది’’.

అంచనాలను అందుకుంటా..

‘‘ఓవైపు మెగాస్టార్‌.. మరోవైపు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌.. ఇంకోవైపు లేడీ సూపర్‌స్టార్‌.. వీళ్లంతా సినిమాలో కొట్టుకునేది గడ్డిపరక లాంటి నా గురించే (నవ్వుతూ). ఈ చిత్ర విషయంలో నాపై చాలా మందికి సందేహాలున్నాయి. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. నేను మెగాస్టార్‌ ఫ్యాన్‌ని. ఆయన నటించిన వంద చిత్రాలు చూసి నేను ఈరోజు నటుడినయ్యా. అందరి అంచనాలను అందుకునేలాగే నా నటన ఉంటుంది’’.

నన్ను నిద్రలేపే పాత్రల్ని వదులుకోను

‘‘మీకు ఇంకా ఓ బలమైన శుక్రవారం పడలేద’ని చాలా మంది అడుగుతుంటారు. దీన్ని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నాకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ రాకపోయినా.. ఒక్కో శుక్రవారం నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూనే వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో శుక్రవారాలు నన్ను ఈస్థాయి వరకు తీసుకొచ్చాయి. నా కెరీర్‌ ఇలాగే ప్లాన్‌ చేసి ఉందని నమ్ముతా. ప్రేక్షకులకు బలమైన కథలు చెప్పాలనేది నా కోరిక. అదే సమయంలో వైవిధ్యభరితమైన పాత్రలూ పోషించాలనుంది. నేను ఉదయం నాలుగైదు గంటలకు నిద్రలేవలేను. కానీ, ఓ క్యారెక్టర్‌ నన్ను నిద్రలేపేలా చేసిందంటే.. కచ్చితంగా అలాంటి పాత్రల్ని వదులుకోను. నాకు రాజమౌళి, సుకుమార్‌, పూరి జగన్నాథ్‌.. ఇలా అందరి దర్శకులతో కలిసి పనిచేయాలని ఉంది’’.

‘‘ప్రస్తుతం నేను చేసిన ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ ‘రామ్‌ సేతు’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్‌ బాటిల్‌’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో డాలీ ధనంజయతో కలిసి ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేయబోతున్నా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని