Indira Devi: మహేష్‌కి మాతృవియోగం

ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయనకి సతీవియోగం, కథానాయకుడు మహేష్‌బాబుకి మాతృవియోగం కలిగింది. కృష్ణ సతీమణి, మహేష్‌ మాతృమూర్తి ఇందిరాదేవి (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో

Updated : 29 Sep 2022 07:09 IST

కన్నుమూసిన ఇందిరాదేవి చిత్రసీమలో విషాదం

ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (Krishna) ఇంట విషాదం నెలకొంది. ఆయనకి సతీవియోగం, కథానాయకుడు మహేష్‌బాబుకి (MaheshBabu) మాతృవియోగం కలిగింది. కృష్ణ సతీమణి, మహేష్‌ మాతృమూర్తి ఇందిరాదేవి (70) (Indira Devi) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1961లో కృష్ణ వివాహం ఇందిరాదేవితో జరిగింది. వారికి రమేష్‌బాబు, మహేష్‌బాబుతోపాటు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం. ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్‌ అనారోగ్యంతో మృతిచెందారు. ఇంతలోనే ఇందిరాదేవి కన్ను మూయడంతో మహేష్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఇందిరాదేవి(70) మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇందిరాదేవి భౌతికకాయానికి సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కృష్ణ, మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, వెంకటేష్, అశ్వనీదత్, మంచు మోహన్‌బాబు, మురళీమోహన్, నందమూరి రామకృష్ణ, నాగార్జున, మంచు విష్ణు, దగ్గుబాటి రానా, అడివిశేషు, విజయ్‌ దేవరకొండ, మెహర్‌ రమేష్, సుకుమార్, గోపీచంద్, త్రివిక్రమ్, బి.గోపాల్, తమన్, కొరటాల శివ, మంచు లక్ష్మి, జీవితా రాజశేఖర్, బండ్ల గణేష్, తమ్మారెడ్డి భరద్వాజ, బోయపాటి శ్రీను, గుణశేఖర్, కె.ఎల్‌.నారాయణ, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు నివాళులు అర్పించారు. బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. మహేష్‌ అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు. మరోవైపు ఇందిరాదేవి మరణం పట్ల పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, శ్రీవిష్ణు, నందమూరి మోక్షజ్ఞ, మారుతి, హరీష్‌శంకర్, అనిల్‌ రావిపూడి, ఆది సాయికుమార్, సుమంత్, రాజీవ్‌ కనకాల, తేజ్‌ తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.

- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


అమ్మ చేతి కాఫీ

సినిమా విడుదలకి ముందు అమ్మ ఇందిరాదేవి దగ్గరికి వెళ్లి ఆమె చేతి కాఫీ తాగడం మహేష్‌కి అలవాటు. ఆ విషయాన్ని మహేష్‌ పలు సందర్భాల్లో చెప్పేవారు. ‘నాకు అమ్మంటే దేవుడితో సమానం. సినిమా విడుదలకి ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతా. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంద’’నేవారు.


తల్లి పేరుతో నిర్మాణ సంస్థ

మంజుల, మహేష్‌ కలిసి తన తల్లి పేరుతో ఇందిరా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో ఇద్దరూ కలిసి పలు చిత్రాల్ని నిర్మించారు.


వెక్కివెక్కి ఏడ్చిన సితార..

నానమ్మ ఇందిరాదేవి భౌతికకాయాన్ని చూసి మనవరాలైన సితార వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కుమార్తెను మహేష్‌ తన ఒడిలో కూర్చొబెట్టుకొని సముదాయించే ప్రయత్నం చేసినా ఆమె కన్నీరు ఆగలేదు. నానమ్మను ఇలా చూసిన సితార.. తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని