Tollywood: ముగింపు మెరిసేనా!

అదిరే ఆరంభం.. మెరుపులాంటి ముగింపు.. ఈ రెండింటికీ క్రికెట్‌లోనే కాదు.. చిత్రసీమలోనూ ఎంతో ప్రాధాన్యముంది. కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి వల్ల ఈ ఏడాది చిత్రసీమకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనింగ్‌లో వచ్చి దంచి కొడతాయనుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు కొవిడ్‌ దెబ్బకు బెదిరి క్రీజులోకి అడుగు పెట్టకుండానే వెనక్కు వెళ్లిపోయాయి.

Updated : 03 Oct 2022 07:05 IST

అదిరే ఆరంభం.. మెరుపులాంటి ముగింపు.. ఈ రెండింటికీ క్రికెట్‌లోనే కాదు.. చిత్రసీమలోనూ ఎంతో ప్రాధాన్యముంది. కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి వల్ల ఈ ఏడాది చిత్రసీమకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనింగ్‌లో వచ్చి దంచి కొడతాయనుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు కొవిడ్‌ దెబ్బకు బెదిరి క్రీజులోకి అడుగు పెట్టకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. నాగార్జున - నాగచైతన్య ‘బంగార్రాజు’తో సంక్రాంతి బరిలో నిలిచి.. చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించడంతో బాక్సాఫీస్‌ ఊపిరి పీల్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్‌’ సినిమాలు చిత్రసీమకు నూతనోత్తేజాన్ని అందిస్తే.. వేసవిలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’ చిత్రాలు భారీ వసూళ్లతో మెరుపులు మెరిపించాయి. అక్కడి నుంచి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘మేజర్‌’, ‘విక్రమ్‌’, ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ2’.. ఇలా నెలకొకటి చొప్పున హిట్టు మాట వినిపిస్తూనే వచ్చింది. ఇప్పుడు సినీ క్యాలెండర్‌ చివరి పేజీల్లోకి చేరుకుంది. ఇప్పటికే దసరా, దీపావళి వినోదాలు ఖరారయ్యాయి. మిగిలింది నవంబరు, డిసెంబరు మాసాల బెర్తులే. కొత్త ఏడాదికి నూతనోత్సాహంతో స్వాగతం పలకాలన్నా.. సంక్రాంతి చిత్రాలకు భరోసా అందించాలన్నా.. రానున్న ఈ రెండు నెలల నుంచి ఓ మెరుపు లాంటి ముగింపు అందిపుచ్చుకోక తప్పదు. మరి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి మెరుపు ముగింపు సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం చిత్రసీమలో ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అగ్ర హీరోల చేతుల్లో కానీ, అటు మీడియం రేంజ్‌ హీరోల చేతుల్లో గానీ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కనిపించడం లేదు. దసరాకు ‘గాడ్‌ఫాదర్‌’తో చిరంజీవి, ‘ది ఘోస్ట్‌’తో నాగార్జున బాక్సాఫీస్‌ బరిలో తలపడబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్లీ వీరిని చూడాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాలి. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్‌’, ‘మెగా 154’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నా.. ఇవన్నీ కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’తో పాటు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలు సైతం వచ్చే ఏడాదే థియేటర్లలోకి వరుస కట్టనున్నాయి. ఇక ప్రస్తుతం ఒక్కో చిత్రంతో బిజీగా ఉన్న రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, నాగచైతన్య, నాని, నితిన్‌, శర్వానంద్‌ తదితర స్టార్లంతా ఈ ఏడాది దర్శనమిచ్చే అవకాశాలు  కనిపించడం లేదు.


అగ్ర తారల్లో ఆ ఇద్దరికే అవకాశం..

తేడాది ముగింపులో ‘అఖండ’గా బాక్సాఫీస్‌ బరిలో నిలిచి భారీ విజయంతో సత్తా చాటారు అగ్రహీరో బాలకృష్ణ. ఇప్పుడాయన మరోసారి ఈతరహా మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తిరేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇది ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. నవంబరు నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని డిసెంబరు బరిలో నిలపడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్‌ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరులో తీసుకొస్తారా? లేక పండగ వైపు మొగ్గు చూపుతారా? అన్నది అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. రవితేజ ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినోదంతో నిండిన సరికొత్త యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.


కుర్ర హీరోలదే జోరంతా..

ఏడాది ముగింపులో కుర్ర హీరోల సందడి రెట్టింపు స్థాయిలో కనిపించబోతుంది. ‘కార్తికేయ2’ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు యువ హీరో నిఖిల్‌. ఇప్పుడాయన ‘18 పేజెస్‌’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. నవంబరు  లేదా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ వేసవిలో ‘మేజర్‌’తో బాక్సాఫీస్‌ ముందుకొచ్చి ప్రేక్షకుల్ని మెప్పించారు కథానాయకుడు అడివి శేష్‌. ఇప్పుడు ‘హిట్‌2’తో మరో హిట్టును ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రమిది. విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు యువ హీరో విష్వక్‌ సేన్‌. ఇప్పుడాయన ‘ఓరి దేవుడా’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. అశ్వత్‌ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో హీరో వెంకటేష్‌ దేవుడి పాత్రలో సందడి చేయనున్నారు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ‘నాంది’ వంటి హిట్‌ తర్వాత అల్లరి నరేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు. అమాయకులైన గిరిజనుల కోసం ఓ ప్రభుత్వ అధికారి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 11న థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది ముగింపులో వరుస సినిమాలతో సందడి చేయనున్నారు యువ హీరో సత్యదేవ్‌. దసరాకి చిరంజీవితో కలిసి ‘గాడ్‌ఫాదర్‌’తో అలరించనున్న ఆయన.. ఆ వెంటనే ‘రామ్‌ సేతు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ చిత్రాలతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఇవన్నీ ఈ సంవత్సరమే థియేటర్లలోకి రానున్నట్లు సత్యదేవ్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.  ‘సెబాస్టియన్‌’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలతో ఈ ఏడాది ఇప్పటికే హ్యాట్రిక్‌ ప్లాప్‌లు అందుకున్నారు కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ రెండు సినిమాలూ.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కిరణ్‌ ఇప్పటికే ప్రకటించారు. పాన్‌ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్న సమంత ‘యశోద’, తేజ సజ్జా ‘హనుమాన్‌’ చితాల్రు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అయితే ఇవి ఈ ఏడాది వస్తాయా? కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల్ని పలకరిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని