Varsha Bollamma: ప్రతినాయిక పాత్రలూ చేయగలుగుతా!

‘‘ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. కొత్తగా.. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అంది నటి వర్ష బొల్లమ్మ. ‘చూసి చూడంగానే’తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి.. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో అందరికీ దగ్గరైంది.

Updated : 04 Oct 2022 11:53 IST

‘‘ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. కొత్తగా.. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అంది నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ‘చూసి చూడంగానే’తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి.. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో అందరికీ దగ్గరైంది. ఇప్పుడు ‘స్వాతిముత్యం’తో (Swathi Muthyam) అలరించేందుకు సిద్ధమైంది. ఇందులో గణేష్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్‌ కె.కృష్ణ తెరకెక్కించారు. బుధవారం విడుదలవుతోన్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది వర్ష.

అందుకే అంగీకరించా..
నిజాయతీగా చెప్పాలంటే.. ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లాంటి పెద్ద నిర్మాణ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు అనగానే ఒప్పేసుకున్నా. తర్వాత కథ నచ్చింది. నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే చాలా ఇష్టం. ఇదీ అలాంటిదే. దీంట్లో కొత్తదనముంది. పాత్రల్లో లోతు ఉంది. కథ, కథనాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి.

పూర్తి భిన్నంగా..
హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్‌’ చిత్రానికి మా ‘స్వాతిముత్యం’కు ఎలాంటి సంబంధం లేదు. కథాంశం విషయంలో ఓ చిన్న పోలిక మాత్రమే ఉంది. మిగతా కథనం అంతా పూర్తి భిన్నంగానే సాగుతుంది. దీంట్లో నా పాత్ర పేరు భాగ్యలక్ష్మి. టీచర్‌గా కనిపిస్తా. బయటకు సరదాగా ఉంటాను కానీ, పిల్లల ముందు కాస్త కఠినంగానే వ్యవహరిస్తాను. నా నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర ఇది. సినిమాలో గణేష్‌ అద్భుతంగా నటించారు. ఇది తనకి తొలి చిత్రంలా అనిపించలేదు.

సైకోగా కనిపించాలి
నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. కాకపోతే ప్రేక్షకులు నన్ను మొదటి నుంచీ మధ్యతరగతి అమ్మాయిగా చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారనుకుంటా. ‘ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయిలా ఉంద’ని వాళ్లు అనుకోవడం వల్లే ఈ తరహా పాత్రలు నాకు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి. సైకో పాత్రలు, ప్రతినాయిక పాత్రలు దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం. ప్రస్తుతం తెలుగులో సందీప్‌ కిషన్‌తో ఓ చిత్రం చేస్తున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని