Bellamkonda Ganesh: కథే ‘స్వాతిముత్యం’ బలం!

‘‘కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. తీరిగ్గా ఓటీటీ వేదికల్లో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే కొత్తదనం ఉన్న కథనే ఎంచుకుని ఈ సినిమా చేశా’’ అన్నారు బెల్లంకొండ గణేశ్‌. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో తనయుడైన ఈయన ‘స్వాతిముత్యం’తో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.

Updated : 05 Oct 2022 07:03 IST

‘‘కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. తీరిగ్గా ఓటీటీ వేదికల్లో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే కొత్తదనం ఉన్న కథనే ఎంచుకుని ఈ సినిమా చేశా’’ అన్నారు బెల్లంకొండ గణేశ్‌ (Bellamkonda Ganesh).  నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో తనయుడైన ఈయన ‘స్వాతిముత్యం’తో (Swathimuthyam) కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ గణేశ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదో ఒకటి చేయాలనుకునేవాణ్ని. పరిశ్రమ నాకు కొత్తేం కాదు. ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉంది. కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాలపై అవగాహన ఉండటంతో సులభంగానే నటించా. సినిమా అంటే కచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని నేననుకోను. కథ బాగుంటే ప్రేక్షకులు ఏ తరహా చిత్రాన్నైనా ఆదరిస్తారు. లక్ష్మణ్‌ ఈ కథ చెప్పగానే చేయాలని నిర్ణయించుకున్నా. సితార నాగవంశీకి కూడా కథ బాగా నచ్చింది’’.

ఆరంభం నుంచి...

‘‘మాకు నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ, నటుడిగా మొదటి చిత్రం బయటి సంస్థలోనే చేయాలనుకున్నా. అలాగైతేనే కథని నమ్మి సినిమా చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు అర్ధం అవుతుంది. ‘స్వాతిముత్యం’ కుటుంబమంతా కలిసి చూసే ఓ మంచి చిత్రం. ఆరంభం నుంచి చివరిదాకా హాస్యం ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్ల నుంచి చిరునవ్వుతో బయటికొస్తారు. తొలి సినిమాలోనే రావురమేష్‌, నరేష్‌, వెన్నెల కిషోర్‌ తదితర సీనియర్లతో కలిసి నటించడం మంచి అనుభవం. ఈరోజే రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంపై కొంచెం ఆందోళనగానే ఉన్నా.. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ల పోస్టర్ల పక్కన నా పోస్టర్‌ చూసుకోవడం ఆనందంగా ఉంది. దసరా పెద్ద పండగ. ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయంటే ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి’’.

పది సినిమాలు..

‘‘రొమాంటిక్‌ కామెడీలంటే ఇష్టం. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలనుంది. నా తొలి పది సినిమాలు పది విభిన్నమైన జోనర్లు చేయాలనుకుంటున్నా. నా అభిమాన కథానాయకుడు వెంకటేష్‌. మంచి కథ, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కుదిరితే అన్నయ్య, నేను కలిసి నటిస్తాం. దర్శకుడు రాజమౌళి సినిమాలో నటించడం కల. రెండో చిత్రంగా ‘నేను స్టూడెంట్‌’ అనే ఓ థ్రిల్లర్‌తో వస్తున్నా. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని