RRR: ఆస్కార్‌ కోసం దరఖాస్తు

మన దేశం తరఫున ఆస్కార్‌ పురస్కారాలకి పంపడానికి జ్యూరీ తిరస్కరించినప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం తన ప్రయత్నాల్ని  కొనసాగిస్తోంది. నేరుగా జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది.

Updated : 07 Oct 2022 07:24 IST

న దేశం తరఫున ఆస్కార్‌ పురస్కారాలకి పంపడానికి జ్యూరీ తిరస్కరించినప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రబృందం తన ప్రయత్నాల్ని  కొనసాగిస్తోంది. నేరుగా జనరల్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. దాదాపు అన్ని ప్రధాన విభాగాల్లో నామినేషన్ల కోసం దరఖాస్తు చేసినట్టు  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం గురువారం అధికారికంగా తెలిపింది. ఆయా దేశాలకి చెందిన జ్యూరీ ఆమోదం లేనప్పటికీ, కొన్నిసార్లు సాధారణ కేటగిరీలో దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటుంది ఆస్కార్‌ కమిటీ. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కూడా నామినేషన్లు దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా అమెరికాలోనే గడుపుతున్న దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకి హాజరవుతున్నారు. ప్రేక్షకుల స్పందనని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నారు. ఓటీటీలో విడుదల తర్వాత సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు సినిమాని మెచ్చుకుంటున్నారు. అక్కడి మీడియాలో కూడా ఈ సినిమాకి ఆస్కార్‌ ఖాయం అనే కథనాలొచ్చాయి. అయితే భారతదేశం తరఫున జ్యూరీ గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ని ఈసారి అధికారిక ఎంట్రీగా పంపింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం చేస్తున్న తాజా ప్రయత్నాలతో మళ్లీ ఆస్కార్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (RamCharan) కలిసి నటించిన చిత్రమిది. అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషించారు. డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని