Cinema News: సంక్షిప్త వార్తలు(5)

కిషోర్‌, సత్యకృష్ణ జంటగా యం.బి (మల్లిబాబు) తెరకెక్కిస్తున్న చిత్రం ‘తార’. వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్నారు. బేబీ నాగ హాసిని, మాస్టర్‌ హర్ష, బేబీ తుషార, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated : 08 Oct 2022 07:18 IST

సినీ ‘తార’ కావాలనే లక్ష్యంతో

కిషోర్‌, సత్యకృష్ణ జంటగా యం.బి (మల్లిబాబు) తెరకెక్కిస్తున్న చిత్రం ‘తార’ (Taara). వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్నారు. బేబీ నాగ హాసిని, మాస్టర్‌ హర్ష, బేబీ తుషార, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టగా.. సాయి వెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది.. చివరకు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంది? అన్నది చిత్ర కథాంశం. అక్టోబరు 14 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.


ఏం చేసైనా.. సాధించాల్సిందే!

శ్రీ సింహ కోడూరి (Sri Simha) కథానాయకుడిగా ప్రణీత్‌ సాయి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భాగ్‌ సాలే’ (Bhaag Saale). అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేహా సోలంకి (Neha Solanki) కథానాయిక. రాజీవ్‌ కనకాల, జాన్‌ విజయ్‌, వర్షిణి సౌందరాజన్‌, నందిని రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈతరం ప్రేక్షకుల్ని అలరించే కథతో.. థ్రిల్లింగ్‌ క్రైమ్‌ కామెడీ సినిమాగా రూపొందిస్తున్నాం. ఏం చేసైనా సరే అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్‌ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కాల భైరవ, కూర్పు: ఆర్‌.కార్తీక శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: రమేష్‌ కుషేందర్‌.


మీ స్ఫూర్తితోనే ఈ పోస్టర్‌

క్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామ్‌ సేతు’ (Ram Setu). సత్యదేవ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని అక్షయ్‌ పంచుకున్నారు. ‘‘మీరు సృష్టించిన ఎన్నో పోస్టర్‌ల స్ఫూర్తితో ఈ కొత్త పోస్టర్‌ను మీ కోసం రూపొందించాం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’అని ట్వీట్‌ చేశారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహించిన రామ్‌సేతు సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న, సినిమా 25న విడుదల కానున్నాయి. రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.


రెండు కొత్త చిత్రాలు?

త ఏడాది ‘పెద్దన్న’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం ‘జైలర్‌’ (Jailer) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. తాజాగా రజనీ మరో రెండు కొత్త చిత్రాలకు పచ్చజెండా ఊపినట్టు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనతో ‘2.0’, ‘దర్బార్‌’ చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రెండు చిత్రాల్లో నటించడానికి రజనీ ఓకే చెప్పినట్లు సమాచారం. ‘డాన్‌’ చిత్ర దర్శకుడు శిబి చక్రవర్తి ఇందులో ఒక చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘జైలర్‌’ చిత్రంలో కుటుంబ అనుబంధాలతో పాటు యాక్షన్‌, వినోదం కూడా ఉంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. వచ్చే వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


చైతూ సినిమాలో జీవా!

‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు తమిళ నటుడు జీవా (Jiiva). ఆయన నాగచైతన్య 22వ (Naga Chaitanya) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) ద్విభాషా  చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో జీవా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది.


హిందీ నటుడు అరుణ్‌ బాలీ కన్నుమూత

సీనియర్‌ హిందీ నటుడు అరుణ్‌బాలీ(79) (Arun Bali) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ముంబయిలోని స్వగృహంలోనే తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అంకుష్‌ వెల్లడించారు. టీవీ షో ‘దుస్రా కేవల్‌’లో షారుక్‌ఖాన్‌కి అంకుల్‌ పాత్రలో నటించి కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ‘చాణక్య’, ‘స్వాభిమాన్‌’, ‘కుంకుమ్‌ ఏక్‌ ప్యారా సా బంధన్‌’ తదితర ధారావాహికల్లో నటించారు. వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు అరుణ్‌. ‘సౌగంధ్‌’, ‘రాజు బన్‌ గయా జెంటిల్‌మ్యాన్‌’, ‘ఖల్‌నాయక్‌’, ‘సత్య’, ‘హే రామ్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘రెడీ’, ‘బర్ఫీ’, ‘కేదార్‌నాథ్‌’, ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’, ‘లాల్‌ సింగ్‌ ఛడ్డా’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘గుడ్‌ బై’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరుణ్‌బాలీ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని