Tollywood: సంక్రాంతి చిత్రంలో ‘ఎన్ని మలుపులో!’

ఆరంభం నుంచి చివరి వరకూ... తరచూ కథల్లో మలుపుల్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేయాలనే తపనతో పనిచేస్తుంటారు సినీ రూపకర్తలు. ఎన్నెన్ని మలుపులుంటే అంతగా రక్తి కట్టించొచ్చనేది వాళ్ల ఆలోచన.

Updated : 12 Nov 2022 09:49 IST

ఆరంభం నుంచి చివరి వరకూ... తరచూ కథల్లో మలుపుల్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేయాలనే తపనతో పనిచేస్తుంటారు సినీ రూపకర్తలు. ఎన్నెన్ని మలుపులుంటే అంతగా రక్తి కట్టించొచ్చనేది వాళ్ల ఆలోచన. కథల్లోని ఆ మలుపుల మాటేమో కానీ... వాటిని తలదన్నేలా సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో ఇటు ప్రేక్షకుడికీ, అటు పరిశ్రమ వర్గాలకి అంచనాకి ఏమాత్రం అందని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సంక్రాంతి వారం పది రోజులు ఉందనగా కూడా మార్పులు చేర్పులతో కొత్త సినిమాలు తెరపైకొస్తుంటాయి. ఏటా జరిగే వ్యవహారమే ఇది. ‘ఆదిపురుష్‌’ సహా పలు చిత్రాల విడుదల వాయిదాతో... 2023 సంక్రాంతి విషయంలోనూ పునరావృతమైంది. మరి ఇప్పటిదాకా ఖరారైన చిత్రాలైనా సంక్రాంతికొస్తాయా లేక వాటిలోనూ వెనకా ముందై మరిన్ని మలుపులు ఉంటాయా అనేదే కీలకం.

తెలుగు సినిమాలకి సంక్రాంతి అతి పెద్ద సీజన్‌. సంక్రాంతిని ‘సినిమా పండగ’లా భావిస్తుంటాయి పరిశ్రమ వర్గాలు. అందుకే పండగ కోసం తెలుగు సినిమాలు పోటాపోటీగా సిద్ధమవుతుంటాయి. అందులో అగ్ర తారల చిత్రాలే ఎక్కువ. పండగకొచ్చే అతిథుల్లా ఒకట్రెండు అనువాద చిత్రాలూ ఈ సీజన్‌పై కన్నేస్తుంటాయి. అయితే ముందుగా అనుకున్నట్టుగా.. ప్రకటించినట్టుగా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు చాలా అరుదు. కరోనా పరిస్థితుల తర్వాత అయితే విడుదల క్యాలెండర్‌ మరింత అస్తవ్యస్థంగా మారింది. అయినా ఎప్పట్లాగే 2023 సంక్రాంతి కోసం దర్శకనిర్మాతలు ముందు నుంచే కట్చీఫ్‌ వేశారు. కథల్లో మలుపుల్లాగా... సంక్రాంతికి రావల్సిన సినిమాలన్నీ రకరకాల కారణాలతో వెనక్కి తగ్గాయి. బరిలోకి కొత్త సినిమాలొచ్చాయి.

ఒకటి అనుకుంటే...

2023 సంక్రాంతి సినిమాలుగా ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రచారంలో ఉన్నది పవన్‌కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ ఒకటైతే, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ మరొకటి. రెండు చిత్రబృందాలూ ముందుగానే సంక్రాంతికి విడుదల అంటూ
ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఆ రెండూ వెనక్కి వెళ్లాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ఇంకా పూర్తి కావల్సి ఉండగా, ‘ఆదిపురుష్‌’ నిర్మాణానంతర పనుల్లో నిమగ్నమైంది. టీజర్‌ విడుదల తర్వాత వచ్చిన స్పందనని దృష్టిలో ఉంచుకుని మరింత నాణ్యమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ని సిద్ధం చేసే పనిలో ఆ బృందం ఉన్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ - శంకర్‌ కలయికలో సినిమా కూడా సంక్రాంతి లక్ష్యంగానే పట్టాలెక్కింది. కానీ అది కూడా ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతి బరిపై కన్నేసింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం చోటు చేసుకోవడంతో అది సాధ్యం కాలేదు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘భోళా శంకర్‌’ సినిమా కూడా సంక్రాంతి విడుదల జాబితాలో కనిపించింది.

కొత్త చిత్రాలు బరిలోకి...

ముందు అనుకున్నట్టుగా చిరంజీవి సినిమా ‘భోళాశంకర్‌’ సంక్రాంతికి రావడం లేదు కానీ, ఆయన నటించిన మరో చిత్రం ‘వాల్తేర్‌ వీరయ్య’ మాత్రం పండగ కోసమే ముస్తాబవుతోంది. చిత్రబృందం ఆ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ‘అఖండ’ సినిమా తరహాలోనే డిసెంబరులోనే బాలకృష్ణ చిత్రం ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతుందేమో అనుకున్నారంతా. కానీ ఈసారి బాలకృష్ణ సంక్రాంతికి సందడి చేయనున్నారు. ఆయనకి సంక్రాంతి హీరో అనే పేరుంది. తెలుగు దర్శకనిర్మాతలు వంశీ పైడిపల్లి - దిల్‌రాజు కలిసి చేస్తున్న తమిళ హీరో విజయ్‌ సినిమా ‘వారసుడు’ ఈ సంక్రాంతికే విడుదలవుతోంది. తమిళ హీరో అజిత్‌ చిత్రం ‘తునివు’ కూడా తెలుగులో సంక్రాంతికే విడుదలవుతోంది. యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏజెంట్‌’ ఎవరూ ఊహించని రీతిలో సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఆ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటివరకు ఖరారైన ఈ సినిమాలు కూడా ఇప్పటికీ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. తెలుగులో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ అంతుచిక్కని విషయంగా మారింది. ప్రణాళికలు అలా ఉంటున్నాయి. అందుకే సంక్రాంతి విడుదలల్లో ఇప్పటికే ఇన్ని మలుపులు చోటు చేసుకున్నాయి. మరి ఈ ప్రహసనానికి ఇప్పటికైనా శుభం కార్డు పడుతుందా లేక, ఇంకా మార్పులేమైనా ఉంటాయా
అనేదే ప్రేక్షకుడి ప్రశ్న.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని