హీరో.. అనడం నాకు నచ్చదు

‘‘వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే కాదు... ఇలాంటివి కూడా చేయగలడని నన్ను నమ్మేలా నటుడిగా నాలోని మరో కోణాన్ని ‘మసూద’ ఆవిష్కరించింద’’న్నారు తిరువీర్‌. ‘మల్లేశం’, ‘పలాస’, ‘జార్జ్‌రెడ్డి’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నటుడీయన.

Published : 29 Nov 2022 02:11 IST

‘‘వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే కాదు... ఇలాంటివి కూడా చేయగలడని నన్ను నమ్మేలా నటుడిగా నాలోని మరో కోణాన్ని ‘మసూద’ ఆవిష్కరించింద’’న్నారు తిరువీర్‌. ‘మల్లేశం’, ‘పలాస’, ‘జార్జ్‌రెడ్డి’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నటుడీయన. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మసూద’లో గోపీ పాత్రతో అలరించారు. ఈ సందర్భంగా తిరువీర్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘నాకు ఎక్కువగా ప్రతినాయక పాత్రలు, సైకో పాత్రలే వచ్చాయి. ఇకపై నేనిలాంటి పాత్రలే చేస్తానా? వాటికే సూట్‌ అవుతానా? అని బాధపడేవాణ్ని. అలాంటి భావన కలిగేలా చేశాయి నా దగ్గరికొచ్చిన పాత్రలు. అందులో నుంచి బయటికొచ్చి విభిన్నమైన పాత్రలు చేయాలనుకున్నా. అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే ఇది. ‘పరేషాన్‌’ అనే సినిమా చేస్తున్న సమయంలో ఛాయాగ్రాహకుడు జగదీష్‌ చీకటి నాకు ఈ సినిమా గురించి చెప్పారు. స్వధర్మ్‌ సంస్థ నుంచి వస్తున్న కథ కదా, వినకుండానే చేద్దామనుకున్నా. దర్శకుడు నన్ను కలిసి నిర్మాతకి నచ్చితేనే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటానంటూ ఆడిషన్‌ కోసం ఓ సన్నివేశం చేయించారు. అది నచ్చాక వచ్చిన అవకాశం ఈ చిత్రం’’.

* ‘‘నేను చేసిన చిత్రాలు ఎక్కువగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నవి, పురస్కారాల చిత్రాలు అన్నట్టే ఉంటాయి. ‘మల్లేశం’, ‘పలాస’, ‘జార్జ్‌రెడ్డి’ చిత్రాలతో నేను పరిశ్రమకి పరిచయమయ్యాను. కానీ ‘మసూద’లోని గోపి పాత్రతో సాధారణ ప్రేక్షకుల వరకు వెళ్లాను. గోపి పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లోనూ సినిమా గురించి, పాత్ర గురించి నాకు సందేశాలు పెడుతున్నారు. నిజ జీవితంలో నేను గోపిలాగే ఉంటాను.  నటుడిగా నన్ను విభిన్న కోణాల్లో చూడొచ్చనే సంకేతాల్ని పంపిన చిత్రమిది’.

‘‘హీరో అనే ట్యాగ్‌ నాకు ఇష్టం ఉండదు. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటే చాలు. ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు తరహాలో అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కథ నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తాను  తప్ప, సంఖ్య కోసమనో, పారితోషికం కోసమో చేయను.  ప్రస్తుతం ‘పరేషాన్‌’ అనే చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ‘మోక్షపటం’, ‘పారాహుషార్‌’ అనే చిత్రాలు చేస్తున్నా. వైజయంతీ మూవీస్‌ సంస్థలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు